నిబంధనల మేరకే డయోగ్నోస్టిక్ కేంద్రాలు నడుస్తున్నాయా..?

పేషెంట్లను వెంటాడుతున్న మరో అనుమానం

దిశ దశ, కరీంనగర్:

వైద్య రంగంలో నిలువు దోపిడి సాగుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ లో మరో దందా తెరపైకి వచ్చింది. అడిగేవారు లేరా..? నిబంధనలు పాటించడం లేదని కొరడా ఝులిపించడం లేదో తెలియదు కానీ కరీంనగర్ లో ఇష్టారాజ్యం అన్నట్టుగా మారిపోయింది. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగులోకి రాగా తాజాగా మరో ఘటన రోగులను నివ్వెరపరుస్తోంది. ఇప్పటి వరకు వైద్యం అందించే ఆసుపత్రులపైనే వచ్చిన ఆరోపణలు ఇప్పుడు డయోగ్నోస్టిక్స్ ల్యాబ్స్ పై కూడా వస్తుండడం సంచలనంగా మారింది. ఆసుపత్రులనే కాకుండా డయోగ్నోస్టిక్ కేంద్రాలు  కూడా కార్పోరేట్ మార్కెటింగ్ చేపట్టాయి. కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పలు డయాగ్నోస్టిక్ సెంటర్ల పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ సమీపంలోని వల్లంపహాడ్ కు చెందిన రవి అనే పేషెంట్ గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవి చెకప్ కు వెల్లే ముందు కరీంనగర్ లో 2డి ఇకో, ఈసీజీ పరీక్షలు చేయించుకుని రిపోర్ట్స్ తీసుకుని వెల్తుంటారు. అయితే గత నెల 21న ఇదే విధంగా కరీంనగర్ లోని కృష్ణా డయాగ్నోస్టిక్ సెంటర్ లో టెస్టులు చేయించుకుని హైదరాబాద్ కు వెల్లగా అక్కడి డాక్టర్లు ఆ రిపోర్టులను చూసి ఆశ్చర్యపోయారు. దీంతో మళ్లీ టెస్ట్ చేయించుకుని రావాలని సలహా ఇవ్వడంతో 23న కరీంనగర్ లోని మరో డయోగ్నోస్టిక్స్ కేంద్రంలో పరీక్షలు చేయించుకుని రిపోర్టులు తీసుకుని వెళ్లాడు. కృష్ణలో ఇచ్చిన రిపోర్టులకు, మరో సెంటర్ లో ఇచ్చిన రిపోర్టులకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో షాకుకు గురి కావడం పేషెంట్ వంతయింది. తప్పుడు రిపోర్టులు వల్ల పేషేంట్ మానసికస్థైర్యం దెబ్బతిన్నదని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. క్వాలిఫైడ్ డాక్టర్లు నిర్వహించాల్సిన ల్యాబులను అనర్హులచే నడిపిస్తుండడం వల్లే ఈ పరిస్థితి తయారైందని ఆరోపించారు. కృష్ణ డయోగ్నోస్టిక్ సెంటర్ నుండి ఇచ్చిన రిపోర్టులో రవి ప్రాణాలు అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకున్నాయని వివరించడంతో హైదరాబాద్ డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారన్నారు. రిపోర్టులను బట్టి పేషెంట్ ఆసుపత్రికి చెకప్ చేయించుకునేందుకు వచ్చే అవకాశమే లేదని అనుమానించిన అక్కడి డాక్టర్లు మళ్లీ చెకప్ చేయించుకోవాలని సూచించారన్నరు. దీంతో మరో డయోగ్నోస్టిక్స్ కేంద్రానికి వెళ్లీ పరీక్షించుకోగా అతని ప్రాణాలకు అంతగా అపాయం ఏమీ లేదని తేల్చారన్నారు. తప్పుడు రిపోర్టులు ఇవ్వడం వల్ల పేషెంట్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ఆందోళణకు గురయ్యారన్నారు. తప్పుడు రిపోర్టు ఇఛ్చిన కృష్ణ డయోగ్నోస్టిక్ సెంటర్ పై విచారణ చేసి, సీజ్ చేయాలని కుతాడి శివరాజ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని డయాగ్నోస్టిక్ కేంద్రాలపై విచారణ చేయాలని కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్. మహిళ సంఘం నాయకురాలు గంగా తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page