మా షోకాజ్ సరే… వీరీ మాటేమిటి మరీ..?

బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి లేఖ రాసిన కార్పొరేటర్

దిశ దశ, కరీంనగర్:

మూలిగే నక్కపై తాటిపండు పడడం అంటే ఇదేనేమో. ఓ వైపున క్రిమినల్ కేసులు వెంటాడుతుంటే మరో వైపున క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ లేఖలు రాస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావుకు కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ ఇచ్చిన లేఖ కలకలం సృష్టిస్తోంది. క్రమశిక్షణా చర్యలు తీసుకునే విషయంలో మీనామేషాలు లెక్కిస్తున్న పార్టీ నాయకత్వానికి మహిళా కార్పొరేటర్ రాసిన ఈ లేఖ సరికొత్త సవాల్ విసురుతోంది. ఆడీయో కాల్ లీకైన విషయంలో తమకు షోకాజ్ నోటీసు ఇచ్చిన నాయకత్వం అక్రమాలు, బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో అరెస్ట్ అయిన పార్టీ నాయకులకు నోటీసులు ఇవ్వకపోవడం ఏంటంటూ ప్రశ్నించిన తీరు పార్టీలో సంచలనంగా మారింది. కరీంనగర్ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్, ఆమె భర్త, పార్టీ నాయకుడు సోహన్ సింగ్ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావును కలిశారు. గతంలో సోహన్ సింగ్ కు చెందిన ఆడియో కాల్ లీకయిన విషయంలో తమ వ్యతిరేక వర్గం ఆరోపణలు చేయగానే షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఈ సందర్భంగా కమల్ జిత్ కౌర్ గుర్తు చేశారు. అయితే కరీంనగర్ కు చెందిన పేదల విషయంలో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో అరెస్ట్ అయ్యారన్నారు. వీరిపై బెదిరింపులకు పాల్పడడం, భూ కబ్జాలకు పాల్పడడంతో పాటు ఇతరాత్ర సెక్షన్లలో కేసులు నమోదయ్యాయయన్నారు. అయితే వారిపై పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని కమల్ జిత్ కౌర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్ లో పార్టీకి నష్టం కల్గిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆ లేఖలో కోరారు.

You cannot copy content of this page