పటిష్టమైన భద్రత… సీసీ కెమెరాల పర్యవేక్షణ..!

అందరి కళ్లుగప్పి వార్డెన్ అనుమతి లేకుండా వెళ్లాడు…

అభిలాష్ మిస్సింగ్ పై జ్యోతిష్మతి యాజమాన్యం ప్రకటన

దిశ దశ, మానకొండూరు:

పటిష్టమైన భద్రత, కళాశాలలో అణువణువు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది… అభిలాష్ అందరి కళ్లుగప్పి హాస్టల్ నుండి వార్డెన్ అనుమతి లేకుండా వెళ్లిపోయాడు… మా కళాశాలపై బురద జల్లాలనే దురుద్దేశ్యంతో సోషల్ మీడియాలో… లోకల్ మీడియాలో తప్పుడు కథనాలు రాస్తూ కళాశాలకు భంగం కల్గిస్తున్నారు… అభిలాష్ మృతిపై నిస్పాక్షపాతంగా విచారణ జరపాలి, బాధ్యులపై చర్య తీసుకోవాలని జ్యోతిష్మతి విద్యా సంస్థల ఛైర్మన్ సాగర్ రావు కరీంనగర్ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్టుగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన వెనక ఎవరు ఉన్నా… చివరకు తాను ఉన్నట్టు తేలినా శిక్షకు సిద్దమేనంటూ ప్రకటించారు.

కళ్లు గప్పడమా..?

మార్చి1న జ్యోతిష్మతి కాలేజీ నుండి డిప్లోమా స్టూడెంట్ అభిలాష్ అందరి కళ్లుగప్పి, వార్డెన్ అనుమతి లేకుండా వెళ్లిపోయాడని జ్యోతిష్మతి యాజమాన్యం ప్రకటించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అదే ప్రకటనలో పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉందని చెప్తోంది. యాజమాన్యం చెప్తున్న ప్రకటనలోనే తప్పిదాలు ఒప్పుకోకనే ఒప్పుకున్నట్టుగా ఉంది. పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నప్పుడు అభిలాష్ అందరి కళ్లు గప్పి ఎలా వెళ్లిపోయాడు..? అతను వెళ్లిపోయేందుకు అనువైన అవకాశం ఉండడం వల్లే బయటకు వెళ్లినట్టు స్పష్టం అవుతోంది కదా. కాలేజీ పేరిట విడుదలైన ప్రకటనలోనే వారి తప్పిదాల డొల్లతనం కనిపిస్తున్నా మీడియా, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరినట్టుగా వివరించడం విడ్డూరంగా ఉంది. మరో వైపున మార్చి 2వ తేది వరకు ఆ కుటుంబ సభ్యులకు అభిలాష్ గురించి ఏ మాత్రం సమాచారం లేదు. అతని పేరెంట్స్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీ ప్రిమిసెస్ లో ఉన్న హాస్టల్ నుండి బయటకు వెల్లిపోయిన మొబైల్ స్విచ్ఛాప్ అయినందున అభిలాష్ గురించి ముందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది..? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంటలో ఉన్న అభిలాష్ పేరెంట్స్ ఎల్ఎండీకి వచ్చి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? మరోవైపు ఆధారాలు లేకుండా వార్తలు రాస్తున్నారని ఇదే ప్రకటనలో చెప్తున్న యాజామన్యం ఇంతకు ముందు కూడా తమ వార్డెన్, స్టూడెంట్స్ తో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఈ విషయంపై శనివారం విడుదల చేసిన ప్రకటనలో కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేసినట్టుగా వెల్లడించింది. అయితే వస్తున్న కథనాల వల్లే అభిలాష్ పేరెంట్స్ మనోవేదనకు గురవుతున్నారని చెప్తున్న యాజమాన్యం… ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. ఇందుకు తప్పుడు వార్తలు రాసిన అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ స్వాగతించాల్సిందే అయితే… ముందుగా అబిలాష్ మిస్సింగ్ అియన మార్చి1వ తేది డే టైంలో ఏం జరిగింది..? రాత్రి వేళల్లో ఏం జరిగింది అన్న వివరాలను సీడీఆర్ ద్వారా సేకరించిన పోలీసులకు వాస్తవ పరిస్థితులు తెలుసన్న విషయం గుర్తు పెట్టుకోవల్సిన అవసరం ఉంది. మరో వైపున తమను ఏ మాత్రం పట్టించుకోలేదని, తమ బిడ్డ మిస్సయినప్పటి నుండి శవమై తేలిన తరువాత కూడా యాజామన్యం పట్టించుకోలేదని అభిలాష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే కావాలనే తమ కాలేజీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ యాజమాన్యం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించడం విడ్డూరం. డెడ్ బాడీ దొరికిన రోజు కూడా కాలేజీలో ఫెస్టివల్ నిర్వహిస్తున్న క్రమంలో విద్యార్థి సంఘాలు ఆందోళ చేపట్టాయి. అప్పుడు ఎల్ ఎండీ పోలీసులు కూడా వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇవన్ని అవాస్తవాలన్నట్టుగా జ్యోతిష్మతి యాజమాన్యం ప్రకటన విడుదల చేయడం అందరిని విస్మయ పరుస్తోంది. అలాగే అభిలాష్ ఏడాది కాల్ డాటా తీసి విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తయాని యాజమాన్యం చెప్తోంది. అభిలాష్ మరణం వెనక దాగిన వాస్తవాల నిగ్గు పోలీసుల దర్యాప్తులో తేలనుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం కాలేజీ ఆవరణలోనే ఉన్న హాస్టల్ నుండి స్టూడెంట్ ఎలా మిస్సయ్యాడు అన్న విషయాన్ని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పటిష్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఉన్నా అతను ఎలా కళ్లుగప్పి వెళ్లాడు..? సెక్యూరిటీ యంత్రాంగానికి, సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వెళ్లడన్న రీతిలో పేర్కొంటున్న తీరే విస్మయాన్ని కల్గిస్తోంది.

You cannot copy content of this page