దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ భూ దందాల వ్యవహారంలోనే కాదు యూనివర్శిటీలోనూ చోటు చేసుకున్న ఘటనలపై విచారణలు మరుగున పడిపోయాయి. ఉన్నత విద్యను అందించాల్సిన శాతవాహన యూనివర్శిటీలో జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారంపై ఇప్పటికీ నిజాలు నిగ్గు తేల్చలేదని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిశెట్టి రాజేశ్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పేపర్ లీకేజీ వ్యవహారం తెరపైకి వచ్చినట్టయింది. సోమవారం కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని కలిసిన రాజేశ్ గౌడ్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి వివరాలు అందించారు. 2021 ఆగస్టు 18న పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి రాగానే ఎస్ యూ విసి మల్లేశం ఎంతటి వారినైనా వదిలిపెట్టమని క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ప్రకటించారన్నారు. అయితే ఇంత వరకు మాత్రం ఈ పేపర్ లీకేజీ బాధ్యుతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రాజేశ్ గౌడ్ ఆ ఫిర్యాదులో వివరించారు. గత ప్రభుత్వంలోని పెద్దలతో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారన్నారు. వీసీ మల్లేశం చర్యల వల్ల విశ్వవిద్యాలయం గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్శిటీ ఎగ్జామినేషన్ వింగ్ లో జరుగుతున్న అక్రమాలపై, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎన్.వి. శ్రీరంగ ప్రసాద్ మీద, రిజిస్ట్రార్ డాక్టర్ ఎమ్. వరప్రసాద్ లపై విచారణ చేయాలని రాజేశ్ గౌడ్ వివరించారు. వీసీ మల్లేశం తీరుతో పాటు లీకేజీ ఘటనపై దర్యాప్తు చేపట్టి దోషులపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ జరపాలని కరీంనగర్ టౌన్ ఏసీపీని సీపీ ఆదేశించారు.