సైన్స్ ఫెస్టివల్ లో ప్రముఖులను మంత్రముగ్ధులను చేసిన మారుమూల బిడ్డలు…

 

ఐఐఎస్ఎఫ్ లో అందరి దృష్టి వారిపైనే

జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్ధుల ప్రదర్శన

దిశ దశ, మహదేవపూర్:

పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే మరి… ప్రత్యేకతలను చాటుకోవాలన్న ఆలోచనలు వారిని వెంటాడుతున్నా… వనరులు లేమి వారిని వెక్కిరిస్తోంది… కావల్సిన సౌకర్యాలు లేవు… అందుకు తగిన ఫ్యాకల్టీ మాట దేవుడెరుగు… ఆ చిన్నారులు చూపిన ప్రతిభ ఢిల్లీలోని ప్రముఖులను అబ్బురపరిచింది. తమ మేథస్సును పెంచిపోషించేందుకు అనువైన కుటుంబ ఆర్థిక పరిస్థితులు లేకున్నా తమలోని జ్ఞిజ్ఞాసకు పదును పెడుతూనే ఉన్నారు. మెట్రో నగరాల్లోని విద్యార్థులను తలదన్నేలా తమలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటూనే ఉన్నారా రిమోట్ ఏరియా స్టూడెంట్స్. ఫరిదాబాద్ లో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులే హైలెట్ గా నిలిచారు. మారుమూల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆ చిన్నారుల ప్రతిభను చూసిన ప్రముఖులంతా అబ్బురపడిపోయారు. జిల్లాలోని మహదేవపూర్, కాటారం, పెద్దాపూర్, మొగుళ్లపల్లి పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఫరిదాబాద్ సైన్స్ ఫెస్టివల్ కు హాజరయ్యారు. అక్కడికి వచ్చిన ఇస్రో ఛైర్మన్ నుండి మొదలు ప్రతి ఒక్కరిని ఆకర్షించుకోగలిగారు వీరిచ్చిన ప్రదర్శనలతో. కాటారం మండల కేంద్రానికి చెందిన అద్నాన్ అప్పటికప్పుడు వేసిన పెన్సిల్ ఆర్ట్స్ ను చూసిన ప్రముఖులంతా సంబరపడిపోయారు. ఇస్రో ఛైర్మన్ సోమనాథన్, కేంద్ర మంత్రులు జితేందర్ సింగ్ లకు వారి చిత్రాలను ఆర్ట్ వేసి అందించాడు అద్నాన్. ఆ చిత్రకారుని విచిత్రమైన క్రియేటివిటీని చూసిన వీవీఐపీలంతా కూడా ముచ్చటపడి అభినందించారు. ఇంత చిన్నవయసులో తనలోని కళాత్మకతను ప్రదర్శిస్తున్న తీరు చూసిన ప్రతి ఒక్కరూ అద్నాన్ అభినందించకుండా ఉండలేకోపోయారు.

రణాడే ప్రాధాన్యత…

ఇకపోతే జిల్లా నుండి సైన్స్ ఫెస్టివల్ కు అటెండ్ అయిన చిన్నారుల్లోని ప్రతిభను గమనించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ డైరక్టర్, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ చీఫ్ కో ఆర్డినేటర్ అరవింద్ రణాడే అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులకు ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు. సైన్స్ ఫెస్టివల్ కు వచ్చిన ప్రతి ప్రముఖుల వద్దకు జిల్లాకు చెందిన విద్యార్థులను తీసుకెళ్లి వారి క్రియేటివిటికి అవసరమైన గుర్తింపు ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ద కనబర్చారు. మహధేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సల్పాల దేవిక, ఆకుతోట మల్లిక లు ప్రదర్శించిన ‘‘నేత్రావధానం’ తో పాటు ఇతరాత్రా స్కిల్స్ ను చూసిన ఆ ప్రముఖులంతా కూడా ఆశ్చర్యపోయారు. చిరు ప్రాయంలోనే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ప్రధర్శిస్తున్న తీరు చూసి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సహా ప్రతి ఒక్కరు కూడా గ్రేట్ అంటూ కితాబిచ్చారు. దేశం నలుమూలల నుండి ఈ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో హాజరైనప్పటికీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా విద్యార్థులను ప్రత్యేకంగా వేదికపైకి పిలిచి మరీ వారిలోని క్రియేటివిటీని ప్రదర్శించేందుకు అవకాశం ఇప్పించడంలో అరవింద్ రణాడే ప్రత్యేక శ్రద్ద కనబర్చారు. మహదేవపూర్ విద్యార్థులు విద్యార్థులు తమలోని క్రియేటివిటినీ ప్రదర్శిస్తున్నంత సేపు కూడా సైన్స్ ఫెస్టివల్ కు వచ్చిన వారంతా రెప్ప వాల్చకుండా అలా చూస్తుండి పోయారు. 29 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అటెండ్ అయిన ఈ సైన్స్ ఫెస్టివల్ లో భూపాలపల్లి విద్యార్థులు చూపించిన ప్రతిభ పాటవాలపై ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం విశేషం. వీరితో పాటు ఈ సైన్స్ ఫేర్ కు జిల్లాలోని పెద్దాపూర్ కు చెందిన ఊరుగొండ సాహిత్య, భూపాలపల్లికి చెందిన లక్ష్మీ రాజసింహ, మొగుళ్లపల్లికి చెందిన శివ యాదవ్ లు అటెండ్ కాగా, గైడ్ టీచర్లుగా మడ్క మధు, ప్రభాకర్ రెడ్డిలు వ్యవహరించారు.

You cannot copy content of this page