సొంత పార్టీ వారినీ వదల్లేదా..? రేవంత్ ఇంటి సమీపంలో మొబైల్ వ్యాన్…

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కో విషయం వెలుగులోకి వస్తుంటే దర్యాప్తు అధికారులే నివ్వరపోతున్నారు. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల నాయకులనే టార్గెట్ చేశారనుకున్నప్పటికీ తాజాగా బయటపడ్డ విషయంలో సొంత పార్టీ వారిని వదలనట్టుగా స్పష్టం అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా సొంతపార్టీలోని నాయకుల కదలికలు ఏంటీ… వారు ఏం చేస్తున్నారన్న విషయాలపై కూడా ఆరా తీసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా కొంతమంది మంత్రులకు సంబంధించిన వ్యవహారాలను ట్రేస్ చేసి సీక్రెట్ ఫైల్స్ అన్ని కూడా ముఖ్యులకు చేరవేసినట్టుగా సమాచారం. గతంలో ఉత్తర తెలంగాణా జిల్లాలకు చెందిన ఓ మంత్రి రాసలీలకు సంబంధించిన విషయాన్ని కూడా ట్యాపింగ్ ద్వారా ట్రేస్ చేసి అలెర్ట్ చేసినట్టుగా కూడా పోలీసుల విచారనలో తేలినట్టుగా సమాచారం. ఈ వ్యవహారంలో ఆధారాలు కూడా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వానికి వీలు చిక్కిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో సంబంధిత హోటల్ నుండి ఫుటేజీలను కూడా మాయం చేశారని… ఆ తరువాత సదరు మంత్రిపై మరింత నిఘాను కట్టుదిట్టం చేశారని కూడా పోలీసు వర్గాల సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ జాబితాలో ఇంకా ఎంతమంది మంత్రులు ఉన్నారు, సొంత పార్టీ నేతలు ఎవరెవరు ఉన్నారు అన్న విషయంపై పార్టీలో కూడా చర్చ సాగుతోంది. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన కూడా ట్యాపింగ్ తోనే గుర్తించినట్టుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్నికల్లప్పుడు కూడా ట్యాపింగ్ పైనే ఆధారపడి పావులు కదిపినట్టుగా గుర్తించినట్టు సమాచారం. అప్పుడు రేవంత్ రెడ్డి ఇంటికి 300 మీటర్ల దూరంలోనే ప్రత్యేకంగా ఓ మొబైల్ వాహనం ఏర్పాటు చేసి ట్యాపింగ్ ప్రక్రియను కొనసాగించారని, రేవంత్ రెడ్డితో మాట్లాడిన వారి వివరాలను ఎప్పటికప్పుడు ముఖ్యమైన వారికి చేరవేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

అడిషనల్ ఎస్పీలపై కేసు…

ఈ కేసులో దర్యాప్తు అధికారులు మరో ట్విస్ట్ ఇచ్చారు. కొంతమంది పోలీసులను విచారిస్తున్న ఇన్వెస్టీగేషన్ అధికారులు భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావు, తిరుపతన్నలను గంటల కొద్ది ప్రశ్నించినట్టుగా సమాచారం. అనంతరం వీరిద్దరిపై కూడా క్రిమినల్ కేసు నమోదు చేశారు. పలు సెక్షన్లలో కేసు నమోదు చేసిన వీరిద్దరిని కూడా ఆదివారం కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page