దిశ ధశ, హైదరాబాద్:
వారంతా కూడా ఒకే తాను ముక్కల్లా విధులు నిర్వర్తిస్తారు. శాంతి భద్రతల పరిరక్షణే వారి ప్రధాన లక్ష్యం. అయితే ఒకే శాఖలో పనిచేస్తున్న వీరిని విభాగాలుగా విభజించి వివిధ రకాల పనులకు పురమాయించే విధానం అమలవుతుంటుంది. అయితే ఒక కుటుంబంలా మొదలాల్సిన పోలీసు డిపార్ట్ మెంట్ లోని ఆయా విభాగాల మధ్య మాత్రం విశ్వసనీయత లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితి నక్సల్స్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న సమయంలో ఉంటే ఆదిపత్య పోరులో పోలీసులు కూడా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని అంటున్న వారూ లేకపోలేదు.
ఎస్ఐబి ఎంట్రీతో…
నక్సల్స్ కార్యకలాపాలను నిలువరించేందుకు ఓఎస్డీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆపరేషన్స్ ఏఎస్పీలు కూంబింగ్ బలగాలను కో ఆర్డినేట్ చేసుకుంటూ… అడవుల్లో ఏం జరుగుతుందో అప్ డేట్ చేస్తూ నక్సల్స్ ఏరివేతలో ఎప్పటికప్పుడు ఓఎస్డీలు అప్ డేట్ చేస్తూ ఉండేవారు. ఈ ఆపరేషన్స్ లో సివిల్, గ్రే హౌండ్స్ బలగాలు కీలక భూమిక పోషిస్తూ నిరంతరం అడవులను జల్లెడ పట్టేవి. ఆ తరువాత ఇతర రాష్ట్రాల మధ్య కూడా సయోధ్య ఉన్నట్టయితే మరింత సానుకూలత వస్తుందని గుర్తించిన ఉన్నతాధికారులు జాయింట్ ఆపరేషన్లకు శ్రీకారం చుట్టారు. టెక్నాలజీకి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇన్ ఫార్మర్ల వ్యవస్థతోనే నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు క్షేత్ర స్థాయి పోలీసు అధికారులు పనిచేసేవారు. ఈ క్రమంలో నక్సల్స్ కవ్వింపు చర్యల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన పోలీసులు చాలా మందే ఉన్నారు. అయితే సమాచార వ్యవస్థ పెరిగిపోయిన క్రమంలో ఇంటలీజెన్స్ వింగ్ లోని ఎస్ఐబీ వ్యవస్థను పటిష్టం చేసి సాంకేతికతను అందిపుచ్చుకుని ఆపరేషన్లు చేపట్టారు. ఎస్ఐబీని టెక్నికల్ గా బలోపేతం చేస్తూ అటు నక్సల్స్ కార్యకలాపాలు, ఇటు వారిని పెంచిపోషించే వారి కదలికలపై నిఘాను కట్టుదిట్టం చేశారు. దీంతో నక్సల్స్ ఏరివేతలో పోలీసులు సక్సెస్ బాట పట్టారు. అయితే ఇక్కడే పోలీసు ఉన్నతాధికారులు తీసుకున్న ఓ నిర్ణయం పోలీసు విభాగంలోని విశ్వసనీయతకు సవాల్ విసిరింది. నక్సల్స్ ఏరివేతలో సక్సెస్ అయిన పోలీసులకు యాక్సిలరీ పదోన్నతులు కల్పించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో అడవుల్లో తిరుగుతూ ఆపరేషన్లు నిర్వహించిన పోలీసులను, హైదరాబాద్ లో ఉంటూ టెక్నాలజితో మానిటరింగ్ చేసిన వారికి ఒకే రకమైన పదోన్నతుల ప్రక్రియను అమలు చేశారు. దీంతో గ్రౌండ్ లెవల్లో సమాచార వ్యవస్థను పటిష్ట పరుచుకున్న పోలీసు అధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్ విధానంతో ఇబ్బందులు పడకతప్పలేదన్న వాదనలు బలంగా ఉన్నాయి. నక్సల్స్ కంచుకోటలో అడుగుపెట్టడమే ఓ సాహసం అంటే సొంత విభాగంలో ట్యాపింగ్ విధానానికి చిక్కకుండా నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో క్షేత్ర స్థాయి పోలీసులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కొంతమంది పోలీసు అధికారులు ఫోన్ ట్యాపింగ్ విధానాన్ని ఉన్నాధికారుల దృష్టికి తీసుకవచ్చారని తెలిసింది. గ్రౌండ్ లెవల్లో ప్రాణాలకు తెగించి తాము కష్టపడుతుంటే ఎస్ఐబీలో టెక్నాలజీ సాయంతో ఫోన్ ట్యాంపింగ్ చేస్తూ నక్సల్స్ ఆఫరేషన్ల క్రెడిట్ ను వాళ్ల కోటాలో వేసుకుంటున్నారని దీంతో తమకు గుర్తింపు లేకుండా పోతోందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము మాన్యూవల్ గా సమాచార వ్యవస్థను పటిష్ట పరుచుకుని వారికి తాయిలాలు ఇస్తూ నక్సల్స్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పడుతున్న కష్ట్రం అంతా ఇంతా కాదని వారు బాసుల ముందు వాపోయారంటే ఎస్ఐబీపై పోలీసు విభాగంలోనూ ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి దయనీయమైన పరిస్థితి సొంత విభాగానికే ఎదరయితే సామాన్యుల పరిస్థితి ఎలా ఉండేదో కూడా గమనించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
యాక్సిలర్ ఎఫెక్ట్…
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటలీజెన్స్ బ్యూరో దేశానికే రోల్ మోడల్ గా మారిందన్న వాదనలు కూడా ఉన్నాయి. విధ్వంసకర శక్తుల కదలికలపై ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసు యంత్రాంగాన్ని కూడా ఎస్ఐబీ అలెర్ట్ చేసి గ్రేట్ అనిపించుకున్న సందర్బాలు చాలానే ఉన్నాయి. దీంతో తెలంగాణ పోలీసుకు కూడా దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రత్యేక స్థానం కూడా దక్కింది. అయితే సొంతరాష్ట్రంలో నక్సల్స్ ఆపరేషన్ల విషయంలో ఎస్ఐబీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల తమకు గుర్తింపు లేకుండా పోతోందన్న ఆవేదన బాహాటంగానే వినిపిస్తోంది. ఇందుకు కారణం యాక్సిలరీ ప్రమోషన్ల విధానాన్ని ఎస్ఐబీలో పనిచేస్తున్న వారికి కూడా అందించడం వల్లే ఈ పరిస్థితి తయారైందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకుని నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేసిన వారికి… ఎలాంటి ఆధునిక వ్యవస్థ లేకుండా సొంత నెట్ వర్క్ పెట్టుకుని శ్రమించిన వారికి ఒకే విధానం అమలు చేయడం వల్లే పోలీసు విభాగంలోని ఆయా విభాగాల మధ్య విశ్వసనీయత లేకుండా పోయిందని తెలుస్తోంది. దీంతో సరిహద్దుల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు కూడా నక్సల్స్ కార్యకలాపాలు కట్టడి చేసే విషయంలో స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టడానికి వెనకంజ వేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి.