అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసలేం జరిగింది..?
దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది… ట్యాపింగ్ చేసిన అంశాలు వెలుగులోకి రాకూడదని సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారని గుర్తించిన పోలీసు అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఎస్ఐబీ కేంద్రీకృతంగానే సాగిందనుకున్నప్పటికీ ఇందులో టాస్క్ ఫోర్స్ వింగ్ కూడా కీలక బాధ్యతలు పోషించినట్టుగా తేలింది. ఈ కేసులో మాజీ డీసీపీ రాధా కిషన్ రావును అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు ప్రాథమికంగా విచారించిన అంశాలను బట్టి కొన్ని విషయాలను తేల్చారు. వీటిని బట్టి గమనిస్తే మాత్రం ఒక్కో వింగ్ కు ఒక్కో బాధ్యత అప్పగించినట్టుగా స్ఫష్టం అవుతోంది. అయితే ఇప్పటి వరకు ఎస్ఐబీ టీమ్స్ ఫోన్ ట్యాపింగకు పాల్పడ్డాయిని ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు, పొలిటికల్ లీడర్ల ఫోన్లను ట్యాప్ చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివిధ కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసు అధికారులు బాధితుల వాంగ్మూలాలు కూడా తీసుకుంటున్నట్టుగా సమాచారం. అలాగే ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఫోన్ నంబర్లను పై అధికారులు ఇచ్చిన వెంటనే వాటి టవర్ లోకేషన్ ట్రేస్ చేయడం… ట్యాపింగ్ చేసి వివరాలను సేకరించడం అధికారుల టీమ్ కు చేరవేసే పనిలో ఎస్ఐబీ స్పెషల్ ఆపరేషన్ టీమ్ నిమగ్నం అయినట్టుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఎస్ఐబీలో పనిచేస్తున్న అధికారులను మాత్రమే అరెస్ట్ చేయడంతో ఇప్పటి వరకు ఇదే విషయం వెలుగులోకి వచ్చింది.
రాధా కృష్ణ రావు అరెస్ట్ తో…
తాజాగా మాజీ డీసీపీ రాధాకృష్ణ రావును అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఆయన పోలీసుల ముందు చెప్పిన విషయాలు కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీసు వాహనాల్లో పార్టీఫండ్ రవాణా చేసినట్టుగా రాధాకృష్ణ రావు ఒప్పుకున్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అనధికారికంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై నిఘా వేయడంతో పాటు ఓ ప్రదాన పార్టీ అభ్యర్థులకు సంబంధించిన డబ్బును చేరవేయడంలో టాస్క్ ఫోర్స్ లోని రాధాకృష్ణ టీమ్ చురుగ్గా పనిచేసిందని తేల్చారు. అయితే వీరు కేవలం సదరు పార్టీకి చెందిన ఫండ్ నే రవాణా చేశారా లేక ఫోన్ ట్యాపింగ్ ద్వారా గుర్తించిన ఇతర పార్టీల అభ్యర్థులకు సంబంధించిన నగదును స్వాధీనం చేసుకుని కూడా చేరవేశారా అన్న అంశం తేలాల్సి ఉంది. టాస్క్ ఫోర్స్ లోని రాధా కృష్ణరావు సపరేట్ గా ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకుని చాలా పనులు చక్కబెట్టారన్న ప్రచారం కూడా పోలీసు వర్గాల్లో ఉంది. అప్పుడు అత్యంత కీలకమైన అధికారుల్లో ఒకరిగా ఎదిగిన ఈ మాజీ డీసీపీ జోక్యం చేసుకున్నారంటే ఏ స్థాయి అధికారి అయినా… ఏ వింగ్ కు చెందిన వారే అయినా కూడా వెనక్కి తగ్గాల్సిందే తప్ప ఆ అంశం వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేకుండా ఉండేదని కూడా తెలుస్తోంది. దీంతో రాధాకృష్ణ ద్వారా పూర్తి వివరాలను రాబట్టేందుందుకు దర్యాప్తు అదికారులు కస్టడీ కోరినట్టుగా తెలుస్తోంది.