ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో పాటు తారకరత్న కుటుంబ సభ్యులు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం తారకరత్నకు మెదడుకు సంబంధించిన చికిత్స కొనసాగుతోంది. ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా కోలుకుంటోందని కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు తారకరత్న ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు ప్రకటించారు.
జనవరి 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు తన మద్దతు తెలిపేందుకు సినీ నటుడు నందమూరి తారకరత్న చిత్తూరు జిల్లా కుప్పంకు వచ్చారు. యువగళం పాదయాత్ర ప్రారంభం అనంతరం లోకేశ్‌కు అభినందనలు తెలిపి తాను కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో కొద్దిదూరం నడిచిన తర్వాత ఆయన తీవ్ర ఆస్వస్థతకు గురికావడంతో.. ఆయన్ను వెంటనే స్థానికంగా ఉన్న పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు.
తారకరతన్న పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను పరీక్షించేందుకు, బెంగుళూరు నుంచి ప్రత్యేక వైద్య బృందం హుటాహుటిన కుప్పం వచ్చింది. వైద్యుల సూచన మేరకు తారకరత్నను బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ తారకరత్న దగ్గరే ఉండి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వైద్యులతో చర్చించి, ఆరా తీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, తారకరత్న ఆరోగ్యంపై ఆసుపత్రి దగ్గరే మకాం వేసిన బాలకృష్ణను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను విదేశీ వైద్యుల బృందం పరీక్షించింది.