బండిపైనే ఎందుకంత ‘తొండి’

ఢిల్లీకెల్లినా… గల్లిలో ఉన్నా అధిష్టానం ఆగ్రహమే…

దిశ దశ, హైదరాబాద్:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా జరుగుతున్న ప్రచారానికి కారణాలేంటి..? అడుగు ముందుకేస్తే చాలు వెనకనుండి దుష్ప్రచారాల పరంపర ఎందుకు కొనసాగుతోంది..? సొంత పార్టీలో ఉన్న నేతలకు ఆయనంటే గిట్టడం లేదా..? వ్యవహార శైలి నచ్చడం లేదా..? ఎప్పుడు ప్రచారం జరిగినా పదవి పోవడం ఖాయమన్న వార్తలకే ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు..? రాష్ట్ర బీజేపీ సగటు కార్యకర్తలను డైలమాలో పడేస్తున్న ఈ ప్రచార పర్వానికి పుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీ మరింత వీక్ అయ్యే ప్రమాదం ఉందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

నెల రోజులుగా…

కొంత కాలంగా బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్ష్య బాధ్యతల నుండి తప్పిస్తారని అంతర్గతంగా ప్రచారం చేస్తూ వచ్చిన ఓ వర్గం గత నెల రోజులుగా ఈ అంశాన్ని పతాక శీర్షికన చేర్చడంలో సఫలం అవుతోంది. ఆయన ఢిల్లీకెల్లినా… గల్లికెల్లినా అధిష్టానం పిలిచిందని మరు క్షణంలో రాష్ట్ర అధ్యక్షునిగా తొలగిస్తున్నారంటూ ఊహాగానాల ప్రచారం తీవ్రంగా పెరిగిపోయింది. బీజేపీ జాతీయ కార్యాలయంలో జరుగుతున్న అత్యంత రహస్య సమావేశంలోని మినిట్స్ లీకయ్యాయన్న రీతిలో జరుగుతున్న ఈ ప్రచారం వెనక ఉన్నదెవరో అన్న విషయం అటుంచితే… ఒక్క బండి సంజయ్ పదవే లక్ష్యం చేసుకుని లీకులివ్వడానికి కారణం ఏంటీ..? రానున్న ఎన్నికల సమయంలో ఆయన ఈ పదవిలో ఉండకూడదన్న కుట్ర కోణం దాగుందా..? ఇందుకు ఇంటా బయట వేసిన స్కెచ్ లే కారణమా అన్న విషయంపై స్ఫష్టత రావల్సి ఉంది. దాదాపు 20 రోజుల క్రితం సంజయ్ వ్యక్తిగత పనిపై ఢిల్లీకి వెల్లినప్పుడు కూడా సంజయ్ ని అధిష్టానం పిలిచింది, ఆయన స్టేట్ ప్రసిడెంట్ పదవి ఊడిపోవడం ఖాయం అంటూ ప్రచారం చేసేశారు. ఈ నెల 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగ సభ నాగర్ కర్నూల్ లో ముగిసిన సంగతి తెలిసిందే. మరునాడు కూడా ఆయన తన నియోజకవర్గానికి చెందిన వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్ల గురించి జాతీయ నాయకులతో మాట్లాడేందుకు వెళ్లారు. అయితే 26వ తేది సోమవారం సంజయ్ అలా ఫ్లైట్ ఎక్కారో లేదా ఆయన పదవి పోయింది అధిష్టానం మందలించింది అంటూ పుకార్లు షికార్లు చుట్టేశాయి. ఈ నెల 25న నాగర్ కర్నూల్ సభకు నడ్డా వచ్చినప్పడే బండి సంజయ్ వ్యవహర శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది కదా అన్న విషయాన్ని విస్మరించడమే కాకుండా సంజయ్ తీరుపై కినుక వహిస్తే ఆ సభనే రద్దు చేసుకుని ఢిల్లీకి పిలిపించే వారు కదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆయన పదవి పోయిందన్నట్టుగానే లీకులు ఇచ్చేశారు. మంగళవారం రాత్రి బండి సంజయ్ ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రాగా ఆయనకు, జాతీయ నాయకత్వానికి కూడా తెలియకుండానే సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేసి, కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేశారు ప్రచారకర్తలు. అలాగే ఖమ్మం సభకు రావాల్సిన అమిత్ షా గుజరాత్ తుపాను కారణంగా పర్యటన రద్దు చేసుకుంటే బండి సంజయ్ పై అధిష్టానం కోపంతో ఊగిపోతోందని ఈ కారణంగానే ఖమ్మం టూర్ షా క్యాన్సిల్ చేసుకున్నారంటూ చెప్పుకొచ్చారు ఆయన వ్యతిరేకులు. చాలా కాలంగా సంజయ తీరుపై హై కమాండ్ సీరియస్ గా ఉందని, తీసేసేందుకు సమాయత్తం అవుతోందని ప్రచారం చేసి ఇక్కడి క్యాడర్ లో బలంగా నాటుకునేలా చేసిన వైరి వర్గం నెల రోజుల నుండి ఆయన్ని తీసేస్తున్నారంటూ ప్రచారం చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడం గమనార్హం.

పదే పదే వివరణలు…

రాష్ట్రంలో బీజేపీ నిర్మాణం కోసం అధిష్టానం చేస్తున్న కసరత్తులు అన్నీ ఇన్నీ కావు. మెయిన్ క్యాడర్ తో పాటు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలు కూడా తెలంగాణపై స్పెషల్ నజర్ వేసి ఎఫెర్ట్స్ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆలోచనలకు తగ్గట్టుగా సంజయ్ స్టేట్ చీఫ్ గా పని చేస్తున్నారు. విడుతల వారిగా చేపట్టిన పాదయాత్రలే కావచ్చు బహిరంగ సభలే కావచ్చు ఇలా ప్రతి విషయంలో కూడా సంజయ్ దూకుడుగా వ్యవహరించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన ముందుకు వెళ్లకుండా కళ్లలో కట్టెలు విసురుతూ ఫెయిల్ అవుతున్నాడన్న సంకేతాలు కూడా అధిష్టానానికి పంపించారు. అయితే ఈ నివేదికలన్నింటిని కూడా జాతీయ నాయకులు చెత్త బుట్ట దాఖలు చేసేయడంతో చివరకు సరి కొత్త పంథాను ఎంచుకుని లోకల్ గా నెగిటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో సంజయ్ ని తీసేస్తారని జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేనంటూ కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు, రాష్ట్ర ఇంఛార్జీలు పదేపదే మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సి వస్తోంది. తాజాగా బుధవారం జరిగిన ప్రచారం కూడా తప్పేనని అధిష్టానం అలాంటి ఆలోచనే చేయడం లేదని తరుణ్ ఛుగ్ తేటతెల్లం చేశారు. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని మార్పుపై జరిగిన ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. అయితే ఈ ప్రచారం పరంపర ఇలాగే కొనసాగితే మాత్రం అలాంటిదేమీ లేదని ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి జాతీయ నాయకత్వానికి ఏర్పడింది.

ఎన్నికల వరకూ ఆయనే…

రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల వరకు కూడా బండి సంజయ్ నే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించేందుకు జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతోంది. ఇప్పటికే ఎన్నికల వరకు అధ్యక్షుడిని మార్చే ఆలోచనలో లేమని పార్టీ ముఖ్య నేతలు ప్రకటించారు కూడా. ఇలాంటి ప్రచారాలకు తలొగ్గి బండి సంజయ్ ని మార్చేందుకు మాత్రం అధిష్టానం సుముఖత వ్యక్తం చేయడం లేదు. అయితే ఇప్పుడు అధిష్టానం ముందు ఉన్న పెద్ద సవాల్ ఏంటంటే బండి సంజయ్ లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రచారానికి కారకులు ఎవరూ అన్నది తెలుసుకోవల్సి ఉంది. అలాంటి వారిని గుర్తించి కట్టడి చేయాల్సిన అవసరం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల ప్రభావం తో కాంగ్రెస్ పుంజుకుంటున్నదన్న వాదనలు తెరపైకి వస్తున్న క్రమంలో పదే పదే అధ్యక్ష మార్పుతో మరింత గందరగోళానికి గురి చేయకుండా ఉండేందుకు పార్టీ పెద్దలు పకడ్భందీ చర్యలు చేపట్టాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page