కిటికీలకు గొనె సంచులు కట్టుకున్నోడివి…
నీ అవినీతి పుస్తకం బయట పెడతా…
ఆస్తులు కూడబెట్టుకున్న చరిత్ర నీది…
అమ్ముకున్న చరిత్ర నాది…
కడియంపై తాటికొండ డైరెక్ట్ అటాక్
దిశ దశ, వరంగల్:
స్టేషన్ ఘన్ పూర్ లో మళ్లీ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల మధ్య వార్ రచ్చకెక్కింది. ఎన్నికలు వచ్చాయంటే చాలు వీరిద్దరి మధ్య విబేధాలు వెలుగులోకి వస్తున్నాయి. టికెట్ కోసం ఒకరు… కాపాడుకునే పనిలో ఉంటే సిట్టింగ్ కౌంటర్ అటాక్ చేయడం రివాజుగా మారిందక్కడ. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై డైరెక్ట్ అటాక్ చేసిన తీరు సంచలనంగా మారింది. అటువంటి వ్యక్తులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని కూడా రాజయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జఫర్ గడ్ మండలం హిమ్మత్ నగర్ లో పర్యటించిన తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను గ్రామాల్లోకి తీసుకెళ్తుంటే ఇంతకాలం గ్రామాల్లో కనిపించని వారు, పార్టీలో ఉన్నవారే అయినా సరే ఊర్లలో తిరుగుతున్నారని వారికి తగిన గుణపాఠం చెప్పాలని రాజయ్య ప్రజలను కోరారు. అన్ని సంక్షేమ పథకాలకు రాజన్న సంతకాలు కావల్సిందేనని ఈ అధికారం తనకు రావడానికి కారణంగా మీరు పెట్టిన భిక్షేనని వ్యాఖ్యానించిన ఆయన కడియం ఇంటికి వెల్తే బానిసల్లగా నిలబడ్డ రోజులు, 20 ఏళ్ల క్రితం నియంత పాలనను కూడా గుర్తుకు తెచ్చుకోవాలని అభ్యర్థించారు. ఘన్ పూర్ ప్రజలు ఇలాంటి వారిపై తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని వారు ప్రతిపక్ష పార్టీ వారే అయినా అధికార పార్టీ వారే అయినా సరే నిలదీయాలని కోరారు. దశాబ్ది ఉత్సవాల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగానని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో కూడా రాష్ట్రంలో తానే ముందు వరసలో నిలుస్తానన్నారు. ఏ రంగంలో చూసినా నీమీద నేను అప్పర్ హైండ్ గానే ఉంటానని, చివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉన్న సాన్నిహిత్యంలో కూడా నేను పై వరసలో నిలుస్తానంటూ తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. ఆరుద్ర పురుగుల్లా గ్రామాల్లో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయని, మండలానికి రూ. 10 లక్షలు కూడా ఇస్తున్నావని, 1994లో ఇంటి కిటికీలకు గొనె సంచులు కట్టుకున్నావంటూ కడియంపై ఫైర్ అయ్యారు. ఆరోజుకు ఈ రోజుకు నీ పరిస్థితి ఏంటీ..? కుబేరుడు అవినీతి తిమింగలమంటూ కడియంపై ఆరోపణల పర్వం గుప్పించారు. శ్రీహరి వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహరించినప్పుడు ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడోనన్న వివరాలను తెలిపే పుస్తకమే ఉందని దానిని బయట పెడ్తానంటూ రాజయ్య హెచ్చరించారు. ఘన్ పూర్ ప్రజలకు నీ ఆస్తులు ఎంతో ప్రజలకు చెప్తా… ఘనపురాన్ని కుదువపెట్టి సంపాదించి మలేషియా, సింగపూర్, బెంగుళూరు, గుంటూరు, హైదరాబాద్ లలో ఉన్న ఆస్తుల వివరాలను కూడా చెప్తానంటూ వెల్లడించారు. తాను కట్టెలమ్ముకున్న చోటే పూలమ్ముకోవాలని చూస్తున్నానని, ఘనపురం నడి బొడ్డున పుట్టిన బిడ్డని నా అడ్డా ఇదేనని స్ఫష్టం చేశారు. నా అయ్య నాకు మూడు గుంటల ఆస్థి ఇస్తే ఎమ్మెల్యే కాకముందే నేను నలభై ఎకరాల ఆస్థి, నాలుగు కార్లు కొనుక్కున్నానని, కొడుకులు కోడళ్లు డాక్టర్లుగా స్థిరపడ్డారని ఇదంతా కూడా స్టేషన్ ఘన్ పూర్ వాసులు పెట్టిన భిక్షేనన్నారు. నా పిల్లలు గొప్ప స్థాయికి చేరుకున్నారని తనకు సంబంధించిన ఐటీ రిటర్న్ రికార్డ్స్ కూడా ఉన్నాయని కుండబద్దలు కొట్టారు తాటికొండ రాజయ్య. తాను ఎన్నికల ఖర్చుకోసం ఘన్ పూర్ లోని హస్పిటల్, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని భూములు అమ్ముకున్నానని వివరిస్తూ, ఆస్థులు అమ్ముకున్న చరిత్ర నాదయితే నీది ఆస్థులు కూడబెట్టుకున్న చరిత్ర అంటూ దుయ్యబట్టారు. ఘన్ పూర్ ప్రజలు ఉసరవెల్లిలా రంగులు మార్చుకుని వచ్చే వారిని నిలదీయాలని అభ్యర్థించిన రాజయ్య, చాటు చాటుకు, దొంగలా మీటింగ్ లు ఎందుకు పెడ్తున్నావు… ధైర్యం ఉంటే ముందుకు రా అంటూ చాట పట్టుకుని చీడను చెరిగి ఏరివేయాల్సిన పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు.