మీరెక్కడికి వెళ్లకండి సార్… ఇక్కడే ఉండండి ప్లీజ్….

ఉపాధ్యాయునితో కన్నీటి పర్యంతం అయిన స్టూడెంట్స్

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

దశాబ్ద కాలంగా అక్కడి పిల్లలతో మమేకమయ్యారా మాస్టారు… విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు వారి మనసుల్లో చిరస్థాయిగా  నిలిచిపోయాడు… బదిలీ అయిన ఆ టీచర్ తమను విడిచిపోతున్నాడని తెలిసిన చిన్ని మనసులు కన్నీటిపర్యంతం అయ్యాయి. సార్ మీరిక్కడే ఉండండి ప్లీజ్ అంటూ రోధించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న శ్రీనివాస్ ఇటీవలె బదిలీ అయ్యారు. దాదాపు పదేళ్లుగా ఈ పాఠశాలలో బోధిస్తున్న శ్రీనివాస్ విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పిస్తూ వారికి ఆత్మీయునిగా మారిపోయారు. తమను అక్కున చేర్చుకుని చెప్పిన పాఠాలు ఇక వినిపించవన్న చేదు నిజాన్ని ఆ చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలె బదిలీ అయిన శ్రీనివాస్ పాఠశాలలో రిలీవ్ అయి వెల్లిపోయారు. అయితే విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకున్న ఆయనకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో గురువారం వీడ్కోలు సమావేశానికి వచ్చిన టీచర్ శ్రీనివాస్ వద్దకు చేరుకున్న విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సార్ మీరిక్కడే ఉండండి సార్ ఎక్కడికి వెల్లొద్దంటూ చిన్నారులు రోధించిన తీరు చూసి స్థానికులు కూడా చలించిపోయారు. పసి పాపల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శ్రీనివాస్ సార్ పై విద్యార్థులు పెంచుకున్న మమకారం చూసిన సహచర ఉపాధ్యాయులు, గ్రామస్థులంతా కూడా విలపించారు. పదేళ్లుగా తమతో అనుబంధం పెనవేసుకున్న ఆయన ఇక తమ బడికి రాడని… ఆయన చెప్పే పాఠాలు వినలేమన్న ఆవేదనతో విద్యార్థులు వెక్కివెక్కి ఎడ్చారు. కిషన్ దాస్ పేట పాఠశాల విద్యార్థుల పట్ల శ్రీనివాస్ చూపించిన ఆదరణ… ఆయన పట్ల ఇక్కడి విద్యార్థులు చూపిస్తున్న అభిమానం గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు.

You cannot copy content of this page