దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
పదవి విరమణకు ముందు విద్యార్థులను సన్మార్గంలో నడవాలని పాఠాలు చెప్పిన ఓ గురువు దారి తప్పి పయనించాడు… రిటైర్ అయిన తరువాత తనలోని లోపలి మనిషికి పని చెప్పాడు. ఇంతకాలం నీతి సూత్రాలు వల్లించిన ఆ మాస్టారు వక్రమార్గంలో పయనించడం మొదలు పెట్టాడు. పోలీసులు కార్యరంగంలోకి దిగడంతో ఆ పెద్ద సార్ గుట్టుగా సాగించిన తీరంతా రట్టయింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు పూర్వా పరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి, సీఐలు గడ్డం సదన్ కుమార్, కృష్ణలు పాల్గొన్నారు.
కోర్టుకే…
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కోర్టులో నకిలీ సర్టిఫికెట్ ద్వారా బెయిల్ పై వచ్చిన విషయం గురించి పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు. గాంధీనగర్ నివాసి అయిన సిరిపురం చంద్ర మౌళీ (61) రిటైర్డ్ టీచర్ ఆధ్వర్యంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం జరుగుతోందని గమనించిన పోలీసులు అతని ఇంట్లో దాడులు చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రముఖులకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు, వివిధ క్యాడర్ అధికారులు జారీ చేసినట్టుగా తయారు చేసిన సర్టిఫికెట్లు, బెయిల్ కోసం కోర్టుల్లో ష్యూరిటీగా సమర్పించేందుకు సిద్దంగా ఉంచిన ఆస్తులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు, వయసు ధృవీరణ పత్రాలు, ప్రభుత్వ పాఠశాలల ద్వారా జారీ చేయాల్సిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, ఆసుపత్రులు జారీ చేయాల్సిన మెడికల్ సర్టిఫికెట్లు, కళ్యాణ లక్ష్లీ లబ్ది కోసం అవసరమైన నకిలీ ధృవీకరణ పత్రాలు, వీఐఫీలు పేరిటి తయారు చేసిన లెటర్ ప్యాడ్స్ స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత శాఖల ద్వారా పథకాలు అందించేందుకు అవసరమైన అర్హతలు ఉన్నవారిగా సర్టిఫై చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో రిటైర్డ్ టీచర్ చంద్రమౌళిని విచారించగా అతనికి ప్రకాష్, శివాజీ, రాజేష్ సహకరిస్తున్నారని, చందుర్తి మండలం అనంతపల్లి మాజీ ఉప సర్పంచ్ నకిలీ ఫ్యామిలీ మెంబర్ షిప్ సర్టిఫికెట్ తీసుకుని లబ్ది పొందాడని, విష్ణు అనే అడ్వకేట్ వాల్యూయేషన్ సర్టిఫికెట్లు తీసుకుని ఇతరులకు ఇచ్చాడని వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు మరిన్ని కోణాల్లో ఆరా తీసి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిటైర్డ్ టీచర్ సిరిపురం చంద్రమౌళి (61), సాయినగర్ లో ప్రింటింగ్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పోలు ప్రకాష్ (55), శివనగర్ కు చెందిన డాక్యూమెంట్ రైటర్ బొడ్డు శివాజీ అలియాస్ శివ (43), చందుర్తి మండలం అనంతపల్లి మాజీ ఉప సర్పంచ్ చిలుక బాబు (45), అడ్వకేట్ బిట్ల విష్ణులను అరెస్ట్ చేయగా, శీలం రాజేష్ లు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
స్టాంపులివే…
జగిత్యాల జిల్లా మల్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజీ, సిరిసిల్ల జిల్లా కేంద్ర ఆసుపత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్, బోయినపల్లి తహసీల్దార్, జగిత్యాల జిల్లా మెట్ పల్లి ప్రభుత్వ హైస్కూల్ గెజిటెడ్ హెడ్ మాస్టర్ ల పేరిట తయారు చేయించిన రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల Tahasidar స్టాంపులు ముద్రించిన ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్స్, బోయినపల్లి తహసీల్దార్ సర్టిఫై చేసినట్టుగా ఉన్న వాల్యూయేషన్ సర్టిఫికెట్లు, పాలీ స్టాంప్ పేపర్ తయారు చేసే మిషన్ తో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కస్టడీ పిటిషన్…
అయతే ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితులను తిరిగి కస్టడీకి తీసుకుని విచారణ చేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటించారు. రిటైర్డ్ టీచర్ చంద్రమౌళి నేతృత్వంలో ఉన్న ఈ ముఠా ఏఏ సర్టిఫికెట్లు ఇచ్చింది, వాటి ద్వారా లబ్ది పొందిన వారు ఎవరూ తదితర పూర్తి వివరాలను రాబట్టాల్సి ఉందన్నారు. కోర్టులో కస్టడీ పిటిషన్ వేసి నిందితులను మరిన్ని కోణాలో ప్రశ్నిస్తామని వెల్లడించారు. నిందితులను తిరిగి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినట్టయితే ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేశారు..? ఎంత కాలం నుండి ఈ స్కాం చేస్తున్నారు అన్న వివరాలు బట్ట బయలు కానున్నాయి.