వేధింపులే కారణమంటూ ఆడియో విడుదల
చెన్నూరులో కలకలం సృష్టిస్తున్న ఘటన
దిశ దశ, చెన్నూరు:
ఒకటి కాదు రెండు కాదు ఐదు ఉద్యోగాలు సాధించిన ఆమెను వేదింపులు బ్రతకనివ్వలేదు. అధ్యాపకురాలిగా చేస్తున్న ఆమెను సహచర ఉద్యోగులే మానసికంగా హింసించడంతో బలవన్మరణానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సంఘటనా వివరాల్లోకి వెల్తే… నస్పూర్ మండలానికి చెందిన తిరుమలేశ్వరి సరస్వతి పుత్రికగా వెలుగొందారు. ఉన్నత చదవులు చదివిన తిరుమలేశ్వరి ఐదు ఉద్యోగాలు సాధించినప్పటికీ విద్యాబోధనపై ఉన్న ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. చెన్నూరు పట్టణంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తిరుమలేశ్వరి స్థానిక చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరణించే ముందు ఆమె విడుదల చేసిన కీలకంగా మారిపోయింది. తనను ప్రిన్సిపల్ మేడం, ఏసీటీ, పీఈటీలతో పాటు మరోకరు టార్చర్ చేశారని, నా చావుకి కారణం వీళ్లేనని, వాళ్ల కాల్ రికార్డ్ పరిశీలించగలరు అంటూ బాధితురాలు తిరుమలేశ్వరి ఆడియో కూడా పోలీసులకు దొరికింది. మరో వైపున బాధితురాలి అన్న కూడా గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వారే తన చెల్లెలు మరణానికి కారకులు అంటూ ఆరోపిస్తున్నారు. తండ్రిని కోల్పోయిన తనకు చెల్లెలు కూడా చనిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన సోదరి ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.