కరీంనగర్ లో సంచలనం… ఫేక్ డాక్యూమెంట్ కేసులో తహసీల్దార్ అరెస్ట్…

దిశ దశ, కరీంనగర్:

ఫేక్ డాక్యూమెంట్లను క్రియేట్ చేసిన కేసులో తహసీల్దార్ సహా పలువురిని కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలోని ఓ భూమి విషయంలో ఈ నకిలీ పత్రం ద్వారా భూమిని ఆక్రమించినందుకు ఈ కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. కొత్తపల్లి పోలీసుల కథనం ప్రకారం… సీతారాంపూర్ కు చెందిన బొంతల రఘుకు పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తి రేకుర్తి, ఆరెపల్లి, సీతారాంపూర్ శివార్లలో ఉంది. ఈ భూమిని 2012లో రఘు రాజు తాత ఐలయ్య నుండి ఆయన తండ్రితో పాటు చిన్నాన్నలకు సమాన భాగాలు చేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో రేకుర్తి శివార్లలోని సర్వే నెంబర్ 29లోని 30 గుంటల భూమి మాత్రం మూటేషన్ అయినప్పటికీ ఆన్ లైన్ లో చూపించలేదు. దీంతో అప్పుడు కొత్తపల్లి తహసీల్దార్ గా పనిచేస్తున్న చిల్ల శ్రీనివాస్ ను కలిసి తన సమస్య పరిష్కరించాలని కోరారు. అయితే ఇందుకు గాను కొంతభూమిని తనకు లంచంగా ఇవ్వాలని తహసీల్దార్ అడగడంతో బాధితుడు ఒప్పుకున్నాడు. 2015లో పట్టాదారు ఐలయ్య చనిపోగా 2016లో అదే భూమిని బాధితుని నానమ్మ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్టుగా నకిలీ డాక్యూమెంట్లు సృష్టించారు. అప్పుడు ధరణి ఆపరేటర్ గా పనిచేస్తున్న పల్లె జీవన్ ద్వారా 2022 ఆగస్టులో రఘు చిన్నాన్న, మేనత్తల పేరిట నాలుగు గుంటల చొప్పున, తహసీల్దార్ బినామి అయిన చంద సంతోష్ తండ్రి శంకరయ్య పేరిట 3.250 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బాధితుడు రఘు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కేసులో ప్రస్తుత గజ్వేల్ తహసీల్దార్ గా పనిచేస్తున్న చిల్ల శ్రీనివాస్, చంద సంతోష్, బొంతల రవి, బొంతల లావణ్య, ఉప్పుల కనక లక్ష్మీ, దాడి రాధ, చుప్ప మంజుల, చిలువేరు స్పప్న, చిలువేరు మల్లేశం, పల్లె జీవన్, వినోద్, బుచ్చి రాజులపై 467, 468, 471, 409, 120(బి) రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లలో కేసు నమోదు చేశారు. వీరిలో తహసీల్దార్ శ్రీనివాస్, చంద సంతోష్, పల్లె జీవన్ లను అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. వీరికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కరీంనగర్ కోర్టు ఆధేశాలు ఇవ్వడంతో వారిని జిల్లా జైలుకు తరలించారు.

You cannot copy content of this page