గృహలక్ష్మీ దరఖాస్తుదారులకు ఇబ్బందులు
దిశ దశ, కరీంనగర్:
గృహలక్ష్మీ పథకం ద్వారా లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించేందుకు సర్కారు ఇచ్చింది ముచ్చటగా మూడు రోజుల సమయం. ఈ లోగా ఆదాయ, కుల దృవీకరణ పత్రాలను సిద్దం చేసుకుని ఫైల్ రెడి చేయడమే గగనం. ఇంత తొందరగా వీటన్నింటిని ఎప్పుడు కంప్లీట్ చేస్తామోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి మరో గండం కూడా వచ్చింది. తహసీల్దార్లు ఎన్నికల శిక్షణ కోసం హైదరబాద్ కు వెళ్లడంతో డిజిటల్ సిగ్నేచర్ కోసం దరఖాస్తు దారులు రెవెన్యూ కార్యాలయాల ముందు బారులు తీరుతున్నారు. తహసీల్దార్లు అందుబాటులో లేని సమయంలో తక్కువ గడువు విధించి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు కావాలంటేనే రోజుల తరబడి వేచి చూడాల్సి ఉంటుందని, అలాంటిది మూడు రోజుల్లోనే ఆదాయ, కుల దృవీకరణ పత్రాలు పొందడం సాధ్యం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
డిజిటల్ సిగ్నేచర్ ఎలా మరి..?
అయితే కంప్యూటరీకరణ అయిన తరువాత ఆన్ లైన్ ద్వారానే సంబంధిత సర్టిఫికెట్లు తీసుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గృహలక్ష్మీ కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆయా సర్టిఫికెట్ల కోసం అన్ని సిద్దం చేసి మీ సేవ ద్వారా అప్ లోడ్ చేసినా సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కొన్ని మండలాల్లో ఎమ్మార్వోలు అందుబాటులో లేకపోవడం వారిని నిరాశకు గురి చేస్తోంది. ఎన్నికల కమిషన్ పిలుపు మేరకు శిక్షణ కోసం హైదరాబాద్ కు వెల్లడంతో కొన్ని మండలాల్లో తహసీల్దార్ల డిజిటల్ కీస్ అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో డిజిటల్ సంతకాలు చేయడం కష్టతరంగా మారింది.