ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మోదీ ప్రైవేటీకరణ చేసినా.. బీఆర్ఎస్ అనుకూల ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరం చేస్తామని చెప్పారు. ఈ సభ వేదికగా దేశ రాజకీయాల గురించి కేసీఆర్ మాట్లాడారు. కేంద్రంలో పెట్టుబడి, దోపిడీ దారుల ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.
2024 తర్వాత మోదీ ఇంటికి, తాము ఢిల్లీకి వెళతామని కేసీఆర్ చెప్పారు. ఎల్‌ఐసీని మోదీ ప్రవేటీకరించారని, తాము వచ్చిన తర్వాత ప్రభుత్వ సెక్టార్‌లోకి తీసుకొస్తామని కేసీఆర్ తెలిపారు. వ్యవసాయాన్ని కూడా మోదీ ప్రైవేటీకరిస్తారని, కార్పొరేట్ గద్దల చేతుల్లో పెడతారని కేసీఆర్ విమర్శించారు. ప్రజల కోసం పుట్టిందే బీఆర్ఎస్ అని, కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని తెలిపారు. దేశంలో మతపిచ్చి రేపుతున్నారని, దేశమంతా రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి తీరాలని తెలిపారు.
రైతుబంధు దేశమంతా అమలు చేయాలన్నది బీఆర్ఎస్ విధానమని కేసీఆర్ చెప్పారు. తమ ప్రత్యర్థులను బెదిరించే పనిలో మోదీ ఉన్నారని అన్నారు. ఇంత సంపద, వనరులు ఉన్న ఈ దేశంలో రైతులు రాజధానిలో నెలల తరబడి పోరాడారని, దేశానికి కావాల్సింది ఇదేనా అని కేసీఆర్ ప్రశ్నించారు. విశాఖ ఉక్కును వదులుకునే ప్రసక్తే లేదన్నారు. రాజ్యాంగాన్ని మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని, బీజేపీపై కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతులకు ఉచిత కరెంట్ అందిస్తామని, బీజేపీపై కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ప్రభుత్వం పతనం ఖాయమన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అగ్నిపథ్ క్యాన్సిల్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మోదీని మాట్లాడమంటే రేకు డబ్బాలో రాళ్లేసినట్లే లొడా.. లొడా మాట్లాడతారని, మోదీగారూ.. మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్ అని కేసీఆర్ తెలిపారు. దేశంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకే బీఆర్ఎస్ ఏర్పాటు చేశామని, మార్పులు తీసుకొస్తామన్నారు.