సర్పంచుల మెడకు దశాబ్ది ఉత్సవాల ఉచ్చు…

ఆర్థిక భారం పడుతోందని ఆవేదన…

నిర్వహించాలని అధికారుల ఆదేశం

దిశ దశ, కరీంనగర్:

మూలిగే నక్కపై తాటిపండు పడిందన్నట్టుగా తయారైంది రాష్ట్రంలోని సర్పంచుల పరిస్థితి. తమ గోడు పట్టించుకునే వారు లేరు కానీ… ప్రోగ్రామ్స్ నిర్వహించాలని హూకుం అయితే జారీ చేస్తున్నారంటూ మదనపడిపోతున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొంతమంది సర్పంచులు అక్కసు వెల్లగక్కుతున్నారు. తమ ఆవేదనను పట్టించుకునే వారే లేరంటూ సర్పంచులు మనోవేదన చెందుతున్నారు. అప్పుల ఊబీలో కూరుకపోయిన తమను గట్టెక్కించండి మహా ప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోకపోగా అదనపు ఖర్చులు వేస్తున్నారని మదనపడిపోతున్నారు. తాజాగా ఓ సర్పంచ్ అధికారులతో చేసిన ఛాటింగ్ నెట్టింట వైరల్ అవుతోంది. తమపై వేస్తున్న ఆర్థిక భారం ఇకనైనా తగ్గించుకోవాలని కోరుతున్నారు.

చెరువు పండగ… సత్కారాల వేడుక…

ఈ నెల 8న నిర్వహించిన ఊర చెరువు పండగ ఘనంగా నిర్వహించాలని అధికారులు పదే పదే చెప్పడంతో ప్రభుత్వం ఇచ్చిన రూ. 25 వేలకు అదనంగా సొంత డబ్బులు కలుపుకుని చేపట్టామన్నారు. జనాభా ప్రాతిపాదికన కాకుండా పంచాయితీ వారిగా రూ. 25 వేల చొప్పున కెటాయించిన ప్రభుత్వం పలు రకాల కార్యక్రమాలు చేపట్టాలని సూచించింది. చెరువుల్లో నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్లతో నీటితో నింపి మరీ కొన్ని ప్రాంతాల్లో ఊర చెరువు పండగ నిర్వహించగా, అన్ని పంచాయితీల్లో కూడా ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిన పనులకు కోసం వెచ్చించిన డబ్బులు అదనంగా అయ్యాయని అంటున్నారు సర్పంచులు. దశాబ్ది వేడుకలు సంబంధించిన ప్రతి పని కూడా గ్రామ స్థాయిలో సర్పంచులు, గ్రామ కార్యదర్శుల ప్రమేయంతో ముడి పడి ఉండగా, ప్రధానంగా ఆర్థిక భారం పడేవాటి విషయంలోనే సర్పంచులు, కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సర్పంచులపై అధికారులు భారం వేస్తుండడంతో కార్యదర్శులపై సర్పంచులు మండిపడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులైన కార్యదర్శులు తమకు ఎదురవుతున్న అనుభవాలను పై అధికారులకు వివరించలేక, సర్పంచులను బుజ్జగించలేక నానా తంటాలు పడుతున్నారు. ఇప్పుడు పంచాయితీలో నాడు నేడు ఫోటోలతో ఏడు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రకాల ఫోటోలను కూడా ప్రదర్శించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ నెల 15న పంచాయితీ కార్మికులకు శాలువాతో సత్కరించి సర్టిఫికెట్లు అందజేయాలని ఆదేశించారు. వీటికి మరిన్ని డబ్బులు వెచ్చించడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి సర్పంచులకు ఎదురయింది. దీంతో దశాబ్ది ఉత్సవాలు తమకు గుది బండలా మారాయని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. ఈ కోపం అంతా వారి కళ్ల ముందు కనిపించే కార్యదర్శులపై తీస్తుండడంతో వారు మింగలేక కక్కలేకపోతున్నారు.

You cannot copy content of this page