టీఎస్పీఎస్సీ లీకేజీని డైవర్ట్ చేసేందుకే…

బీజేపీ నేతలపై కేసులు

ఈటల సంచలన వ్యాఖ్యలు

దిశ దశ, వరంగల్:

గ్రూప్స్ ఎగ్జామ్స్ పేపర్స్ ఆరు పేపర్లు లీకయ్యాయని, ఈ అంశం డైవర్ట్ అయ్యేందుకే బీజేపీ నేతలపై కేసులు పెట్టించారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హన్మకొండ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాజ్ దీప్ సర్దేశాయ్ కేసీఆర్ దేశమంతా ఎన్నికల ఖర్చు పెడ్తానని మాట ఇచ్చాడని చెప్పిన విషయంపై ప్రజల దృష్టి మరల్చాలనే కేసులు పెట్టారని దుయ్యబట్టారు. తీహార్ జైళ్లో ఉన్న సుఖేష్ కూడా హైదరాబాద్ లోని గులాభి పార్టీ కార్యాలయం సమీపంలో రేంజ్ రోవర్ కారులో రూ. కోట్లు ఇచ్చానని చెప్పిన అంశం కూడా మరుగున పడాలంటే బీజేపీ నేతలపై కేసులు పెట్టాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చుని ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఈటల మండిపడ్డారు. అంతేకాకుండా లిక్కర్ కేసుపై కూడా ప్రజల్లో చర్చ జరగవద్దన్న ఉద్దేశ్యంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నాడన్నారు. పిల్లల భవిష్యత్తును కోరే పార్టీ బీజేపీ అని, విద్యార్థులతో నేరుగా ఇంటరాక్షన్ అవుతున్న ప్రధాని మోడీ నాయకత్వంలో ఉన్న పార్టీలో ఉన్నానని ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం అయితే 11 గంటల తరువాత బయటకు వచ్చిన పేపర్ ను లీకేజీ అని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ సందర్భంగా ఈటల తన ఫోన్ ను పోలీసులకు అప్పగించి ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. పోలీసులు నోటీసులో పేర్కొన్న నంబర్ నుండి తనకు ఎలాంటి వాట్సప్ మెసేజ్ రాలేదని, వేరే నంబరు నుండి వచ్చిన మెసెజ్ ను తాను ఓపెన్ కూడా చేయలేదని ఈటల పోలీసు అధికారులకు వివరించారు.

You cannot copy content of this page