కేసీఆర్ మాటలన్నీ కోతలే
ఏ రైతును కదిలించినా కన్నీళ్లే
బీజేపీ స్టేట చీఫ్ బీఎస్కే ఫైర్
దిశ దశ, కరీంనగర్:
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమాను తెలంగాణ రైతాంగానికి కూడా వర్తింపజేస్తే ఈ పరిస్థితి ఉండేదా..? రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పిన సమగ్ర పంటల భీమా విధానం ఏమైంది అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో గత 8 ఏళ్లలో నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నవా అని అడిగారు. నిర్ణీత సమయంలో కొనుగోలు కేంద్రాలను తెరిచినట్లయితే సగం మంది రైతులకు నష్టం జరగకపోయేదని, దీంతో వరి కోతలు చేపట్టకుండా రైతులు ఆగిపోవడంతో వడగండ్ల వర్షంతో వరి అంతా నాశనమయి పోయిందన్నారు. కేంద్రం విపత్తుల కింద తెలంగాణకు కేటాయించిన రూ. 3 వేల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు బిచ్చగాళ్ల లెక్క ప్రతిసారి అడుక్కోవల్సి దౌర్భాగ్యం తయారైందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నీ కొడుకు, బిడ్డ సంపాదనలో ఒక్క శాతం ఖర్చు పెట్టినా రైతులకు సాయం అందేది కదా అని అన్నారు. పంజాబ్ రైతులకిచ్చిన చెక్కులు చెల్లలేదని, స్వరాష్ట్రమైన తెలంగాణ రైతుల వద్ద కూడా అన్నీ కోతలేనా కోయడమేనా అని ఎద్దేవా చేశారు. కనీస మద్దతు ధర కాకుండా అదనంగా ఏనాడైనా వరికి రూ.500 బోనస్ ఇచ్చారా..? ధాన్యం తానే కొంటానని చెప్పి కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారంభించడన్నారు. తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, లేనట్టయితే బీజేపీ పక్షాన రైతులకు పరిహారం అందేదాకా పోరాడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. గత నెలలో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. గత నెలలోనే సీఎం కేసీఆర్ జిల్లాలోని రామడుగు వచ్చి అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తానని ప్రకటించినప్పటికీ నేటికి ఒక్కరికి కూడా సాయం అందలేదని మండిపడ్డారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరగగా కేవలం 8 వేల ఎకరాలకే సాయం అందించాలని నివేదిక రెడీ చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 288 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించినా నేటికీ ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందలేదన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ఎక్కువ మంది రైతులు చనిపోయారని వారికి కేంద్ర ఇచ్చిన ఎన్డీఆర్ఎఫ్ కింద నిధులు కెటాయించినా వాటిని చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకుంటే సీఎం కేసీఆర్ కు ఉన్న అభ్యంతరేంటని సంజయ్ ప్రశ్నించారు. ఫ్రీ యూరియా ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పి, రుణమాఫీ చేస్తానని ప్రకటించి, రైతును రాజును చేస్తానని, భూకంపం సృష్టిస్తానని ముఖ్యమంత్రి చెప్పిన మాటలన్నిగాలిలో కలిసిపోయాయన్నారు. వడగండ్ల వానలతో రైతులు పంట నష్టపోతున్నాని, ఇండ్లు కూలిపోతున్నయని, పశువులు చనిపోతున్నాయని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే బాధిత రైతును ఆదుకున్న దాఖాలాలు మాత్రం రాష్టంలో లేవని దీంతో ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నయన్నారు. సర్వేలు, నివేదికల పేరుతో, మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలతో కాలయాపన చేయడం తప్ప రైతాంగానికి బాసటనిచ్చే పరిస్థితి మాత్రం లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, సొల్లు అజయ్ వర్మ తదితరులు ఉన్నారు.