ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలన్న హైకోర్ట్… మధ్యంతర ఉత్తర్వులు జారీ

దిశ దశ, హైదరాబాద్:

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని ఆదేశిస్తూ స్టే విధించింది. మాధాపూర్ సమీపంలోని తమ్మిడి కుంట ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం జరిగిందన్న ఫిర్యాదు మేరకు శనివారం ఉదయం హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. సుమారు 3.20 ఎకరాల భూమి నీటివనరకులు సంబంధించిందన్న ఫిర్యాదు మేరకు అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున హై కోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ వినోద్ కుమార్ స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

న్యాయ పోరాటం చేస్తాం: 

ఎన్ కన్వెషన్ కూల్చివేతపై అక్కినేని నాగార్జున ‘‘ఎక్స్’’ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అధికారులు చట్ట విరుద్దంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. హై కోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చివేయడం సరికాదన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా చర్యలకు దిగడంపై నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రతిష్టను కాపాడుకోవడం కోసం, వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నానని వెల్లడించిన నాగార్జున చట్టాన్ని ఉల్లంఘించే విధంగా తామెప్పుడూ వ్యవహరించలేదన్నారు. అదంతా కూడా పట్టా భూమేనని ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని, గతంలో ఇచ్చిన అక్రమ నోటీసులపై స్టే కూడా ఉందని నాగార్జున వివరించారు. కూల్చివేత చట్ట వ్యతిరేకంగా జరిపారని, కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కోర్టు తాను చేసిందని తప్పని తీర్పు చెప్తే స్వయంగా కూల్చివేసేవాడనన్నారు. తాజా పరిణామాల వల్ల ఆక్రమణలకు పాల్పడ్డామన్న తప్పుడు ప్రచారం ప్రజల్లోకి వెల్లే అవకాశం ఉన్నందున ఆ అభిప్రాయాన్ని దూరం చేయాలన్న ఉద్ధేశ్యంతోనే ఈ ప్రకటన విడుదల చేస్తున్నానని అక్కినేని నాగార్జున తెలిపారు. అధికారుల చర్యలపై కోర్టను ఆశ్రయిస్తానని, అక్కడ తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాని నాగార్జున వెల్లడించారు.

You cannot copy content of this page