తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతారని.. సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను జాగ్రత్తగా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ తర్వాత కేటీఆరే అంతటి సమర్థవంతమైన నాయకుడని వ్యాఖ్యానించారు. తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆరే అని స్పష్టం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రాష్ట్రానికి ఇండస్ట్రీస్, ఐటీ సంస్థలు ఎన్నో వచ్చాయని తెలిపారు. అయితే ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కేటీఆర్ నాయకత్వంలో ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. నిరుద్యోగ యువతకు చాలా ప్రోత్సాహకాలు అందుతున్నాయని తెలిపారు. వరంగల్లో కూడా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు రావడం వారి ప్రోత్సాహకంతోనే జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని.. ఈ సేవలను వినియోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వారోత్సవాల్లో పలు కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహించి.. పలువురిని సత్కరించనున్నారు. మహిళలకు క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వారి ఆరోగ్యం గురించి హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, అత్యుత్తమ ప్రదర్శన చేసిన మహిళలను సన్మానించనున్నారు.