సఫలమైన చర్చలు…
దిశ దశ, హైదరాబాద్:
సమ్మె బాట పట్టిన రేషన్ డీలర్లు శాంతించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో రేషన్ కార్డు దారులకు నిత్యవసరాలు అందించేందుకు సుముఖత తెలిపారు. ఈ మేరకు మంగళవారం రేషన్ డీలర్లతో జరిగిన చర్చల్లో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని 2 కోట్ల 83 లక్షల రేషన్ కార్డు దారుల ప్రయోజనం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, పేదలు ఆకలితో అలమటించకుండా ఉండాలంటే డీలర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. డీలర్ల సంక్షేమంపై దృష్టి సారిస్తామని, కమిషన్ పెంపు విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్తామని మంత్రి గంగుల వారికి హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు తాము సమ్మె నుండి తప్పుకుంటున్నామని డీలర్స్ జేఏసీ ఛైర్మన్ నాయికోటీ రాజుతో పాటు సంఘ ప్రతినిధులు ప్రకటించారు. ఇంతకుముందు జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, కమిషన్ పెంపు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెల్తానని ప్రకటించడం పట్ల సంఘ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.