ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందా…?

సర్పంచుల మనోవేదన…

అడకత్తెరలో పోక చెక్కల్లా కార్యదర్శులు

దిశ దశ, హైదరాబాద్:

మూలిగే నక్కపై తాటిపండు పడిందన్నట్టుగా తయారైంది ఆ ప్రజా ప్రతినిధుల పరిస్థితి. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకపోయి ఉన్నామని మనోవేదనకు గురవుతుంటే తమపై ప్రభుత్వం మరో పిడుగు వేస్తోందంటున్నారు. స్వరాష్ట్రం సిద్దించిన సందర్భంగా 20 రోజుల పాటు చేస్తున్న దశాబ్ది ఉత్సవాలు వారి పాలిట శాపంగా మారాయి. రాష్ట్రంలోని 12751 గ్రామ పంచాయితీల్లోనూ ఇదే పరిస్థితి కొట్టుమిట్టాడుతోంది. మరో రెండు రోజుల్లో గ్రామాల్లో ఊర చెరువు పండగ నిర్వహించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత జలశయాల రూపు రేఖలు ఎలా మారాయి, గ్రామాల్లో జలాలు సమృద్దిగా ఉన్నాయి అన్న విషయాన్ని గ్రామ ప్రజలకు ప్రత్యక్ష్యంగా చూపించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఊర చెరువు పండగ…

ఈ నెల 8న ఊర చెరువు పండగ నిర్వహించేందుకు సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో పంచాయితీకి రూ. 25 వేలు కెటాయించిన ప్రభుత్వం గ్రామంలోని ప్రజలను ఈ వేడుకల్లో భాగస్వాములు చేయాలని సూచించింది. ప్రధానంగా వేడుకలకు హాజరైన వారికి భోజనం ఏర్పాటు చేయడంతో పాటు చెరువుల వద్ద లైట్లు ఏర్పాటు చేయడం, రంగవల్లలు వేయించడం, కట్ట మైసమ్మకు, చెరువు నీటికి పూజలు చేయడం, బతుకమ్మ ఆట, కోలాటం, పాటలు, ఇరిగేషన్ అభివృద్ది చర్యలు వల్ల పెరిగిన సాగు గణాంకాలు, పెరిగిన భూగర్భ జలాలను వివరించే విధంగా ఫ్లెక్సీల ఏర్పాటు, కరపత్రాల ముద్రణ, టెంట్లు, సౌండ్ సిస్టం పలు రకాల చర్యలు తీసుకోవల్సి ఉంది. అయితే రూ. 25 వేలతో ఇవన్ని సాధ్యం కావని సర్పంచులు అంటుండడంతో కార్యదర్శలు పరిస్థితి అయోమయంగా మారిపోయింది. పంచాయితీ నిధులను వాడుకునే అవకాశం కూడా లేకపోవడంతో ఒక్కో పంచాయితీ పరిధిలో జనాభాను బట్టి రూ. 2 లక్షల నుండి 5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అదనంగా పెట్టే ఖర్చు తమ సొంత డబ్బులు పెట్టాల్సి వస్తుందని, ఇప్పటికే పంచాయితీల పరిధిలో నిర్మించిన వైకుంఠ ధామాలు, పార్కులు, తడి చెత్త, పొడి చెత్త కేంద్రాల నిర్మాణాలకు అప్పులు చేశామని ఇఫ్పుడు ఊర చెరువు పండగకు డబ్బులు ఎక్కడి నుండి తేవాలో అంతు చిక్కడం లేదని సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వేడుకలు సర్పంచుల ఆధ్వర్యంలోనే నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఆదేశించడంతో కార్యదర్శులు సర్పంచుల ముందు ఈ అంశాలను పెట్టినప్పుడు వారు ససేమిరా అంటున్నారు. దీంతో కార్యదర్శుల పరిస్థితి అయోమయంగా తయారైంది.

జనాభా ప్రాతిపదికన…

అయితే ఊర చెరువు పండగలకు రూ. 25 వేలు ఏ మూలకు సరిపోవని మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా జనాభా ప్రాతిపదికన నిధుల కెటాయింపు చేస్తే బావుండేదని కూడా అంటున్నారు. 10 వేలకు పైగా జనాభా ఉన్న మేజర్ పంచాయితీ అయినా 200 జనాభా ఉన్న సాధారణ పంచాయితీకి అయినా ఒకే లెక్కన రూ. 25 వేలు కెటాయించడం కూడా సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నీళ్లెక్కడా…?

ఊర చెరువు పండగలకు చాలా ప్రాంతాల్లో నీటి కొరత కొట్టిచ్చినట్టుగా కనిపిస్తోంది. చాలా గ్రామాల్లోని చెరువులు నీరు లేక బోసిపోయాయని కేవలం కాళేశ్వరం, ఎస్సారెస్పీ, వరద కాలువ వంటి ప్రాజెక్టుల కాలువల ద్వారా నీటి సరఫరా అవుతున్న ప్రాంతాల్లోని చెరువుల్లో నీరు ఉన్నప్పటికీ, ఇతర ప్రాంతాల్లోని చెరువుల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. దీంతో నీరు లేని చెరువుల్లో వేడుకలు నిర్వహిస్తే జనం నవ్విపోతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ చెరువుల్లో కొంత నీరయినా ఉండాలంటే ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయాల్సిన పరిస్థితి తయారైందని, ఈ పద్దతిన చేస్తే సర్పంచులపై మరింత ఆర్థిక భారం పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సర్పంచులపై అదనపు భారం: ఉప్పుల అంజనీ ప్రసాద్, అల్గి జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడు.

రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని ఆదేశించిన ఊర చెరువు పండగతో సర్పంచులపై అదనపు భారం పడుతోంది. రూ. 25 వేలతో అన్ని ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదు కానీ వేడుకలను ఆర్భాటంగా నిర్వహించాలని సర్కారు చెప్తోంది. అధికారులు కూడా సర్పంచులపై ఈ బాధ్యతలు వేశారు. దీంతో ఊర చెరువు పండగ నిర్వహించేందుకు అదనంగా లక్షల రూపాయలు అప్పులు చేయాల్సిన పరిస్థితి తయారైంది. పండగ నిర్వహించాలంటే సర్పంచులు పస్తులుండడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదు. అధికారులు కూడా సర్పంచుల దీనస్థితిని అర్థం చేసుకుంటే బావుంటుంది. అదనపు ఆర్థిక భారం వేయకుండా వేడులకు ఎంత ఘనంగా నిర్వహించమంటే అంతగా నిర్వహిస్తాం.

You cannot copy content of this page