మూగబోయిన పాట…

తరలిరాని తీరాలకు చేరిన గాయకుడు

సాయి చందు హఠాన్మరణం

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ బాణిలో తన గాత్రంతో మంత్రముగ్దులను చేసిన మరో గాయకుడు అందనంత దూరాలకు చేరాడు. నాలుగు పదులు వయసు చేరక ముందే గుండె పోటు రూపంలో మృత్యువు అతన్ని కబళించింది. చిరు ప్రాయంలోనే తన కళతో కోట్లాది మంది ప్రజల మనసుల్లో నిలిచిపోయిన సాయి చందు ఆ స్థానాన్ని పదిలంగా ఉంచి బౌతికంగా తెలంగాణ సమాజానికి కనిపించకుండా పోయాడు. రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న సాయి చందు బుధవారం అర్థరాత్రి తనువు చాలించడం అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. బుధవారం సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లా బిజేనేపల్లి మండలం కారుకొండలోని తన ఫాం హౌజ్ కు సాయిచందు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. అర్థరాత్రి అస్వస్థకు గురైన సాయి చందును నాగర్ కర్నూల్ లోని గాయత్రి ఆసుపత్రికి తలరించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం గచ్చిబౌళిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. సాయిచందు వెంట ఆయన భార్య రజని, పిల్లలు, గన్ మెన్లు ఉన్నారు. సాయిచందు మరణం పట్ల రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి పట్ట రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉద్యమ ప్రస్థానం నుండి…

స్వరాష్ట్ర కల సాకారం కోసం చేపట్టిన ఉద్యమంలో కీలక భూమిక పోషించింది తెలంగాణ కళాకారులదే. వీరు తమ పాటలతో ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేసిన తీరు అనన్య సామన్యమని చెప్పొచ్చు. ఇందులో తనవంతు పాత్ర పోషించిన సాయిచందు తెలంగాణ సమాజాన్ని తట్టిలేపే విధంగా పాటలు పాడారు. ఉద్యమ ప్రస్థానంలో ఊరు వాడ కలియతిరిగి తనవంతు బాధ్యతలు నిర్వర్తించిన సాయి చందు స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు పాట రూపంలో వినిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు హాజరయ్యే సమావేశాలతో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ సాయి చందు భాగస్వామ్యం ఉంది. ఆయన మృతి తెలంగాణ రాష్ట్ర ఓ కళాకారున్ని కోల్పోయిందనే చెప్పాలి.

You cannot copy content of this page