శాశ్వత నిద్రలోకి… శాంతి స్వరూప్… తెలుగు తొలి న్యూస్ యాంకర్ ఆయనే…

దిశ దశ, హైదరాబాద్:

అప్పటి వరకూ అందరి ఇళ్లలో రేడియోల ద్వారా అందించే సమాచారం కోసం ఎధురు చూసే పరిస్థితి తెలుగునాట నెలకొని ఉండేది. ప్రాంతీయ, జాతీయ వార్తలు తెలుసుకునేందుకు రేడియో సౌండ్ వాల్యూమ్ పెంచుకుని ఇంట్లో ఏదో పనిలో ఉంటూ వార్తలు వినేది ఆ నాటి తరం. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అనగానే చెవులు అలెర్ట్ అయి జాతీయ, అంతర్జాతీయ వార్త విశేషాలను తెలుసుకునేవి. అయితే ఆ ట్రెండ్ నే మార్చేసిన ఘనత మాత్రం దూరదర్శన్ కే దక్కగా తెలుగు తొలి న్యూస్ యాంకర్ గా రికార్డు శాంతి స్వరూప్ రికార్డు సృష్టించారు. యాంటెనాల ద్వారా టీవీలను ఏర్పాటు చేసుకుని దూరదర్శన్ వార్తలు వినేందుకు ,చాలా మంది ఆసక్తి చూపించే వారు. 1983 నవంబర్ 14న రాత్రి 7 గంటలకు ప్రారంభం అయిన దూరదర్శన్ వార్తల ప్రసారాలు ప్రారంభం కాగా తెలుగు న్యూస్ చదివి వినిపించిన చరిత్ర శాంతి స్వరూప్ కే దక్కింది.

ఐదేళ్ల నిరీక్షణ…

ఇఫ్పుడే అందిన విషాదకర వార్త బంగాళ ఖాతంలో అల్పపీడన ధ్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా పడింది. తీర ప్రాంత వాసులపై తుపాను ప్రభావం తీవ్రంగా పడడంతో జనజీవనం అతలాకుతలం అయింది…. వాతావరణ శాఖ అధికారులు మరో రెండు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అంటూ ముఖంలో విషాద ఛాయలు కనిపించే విధంగా వార్తలు చదివే వారు శాంతి స్వరూప్. ఆ వెంటనే వచ్చే సంతోషకరమైన వార్త చదవినా ఆయన వదనంలో చిరునవ్వు కనిపించే తీరు అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునేది. వార్తను చదవడమే కాదు అందుకు తగిన విధంగా ఆయన ముఖ కవలికలను మార్చుతూ వార్తలు అందించిన తీరు మాత్రం ఆనాటి తరం నేటికీ మరిచిపోలేదు. అయితే 1978లో వార్తలు చదివే న్యూస్ రీడర్ గా 1978లో దూరదర్శన్ లో చేరిన శాంతి స్వరూప్ బుల్లితెరపై కనిపించేందుకు ఐదేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది.

టెలీ ప్రాంప్టర్ లేకుండానే…

హైదరాబాద్ నివాసి అయిన శాంతి స్వరూప్ దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా జాయిన అయిన కాలంలో వార్తలు చూసి చదివేందుకు అవసరమైన సాంకేతికత కూడా అందుబాటులో లేదు. స్క్రిప్టులను ఆధారంగానే ప్రేక్షకులకు వార్తలు అందించాల్సిన పరిస్థితి ఉండేది. శాంతి స్వరూప్ ఇందుకు అవసరమైన విధంగా ముందుగానే ప్రిపేర్ అయి న్యూస్ ప్రజెంటేషన్ చేసేవారు. అప్పట్లో శాంతి స్వరూప్ చదివే వార్తలు వినడానికి అత్యంత ఆసక్తి చూపించే వారు. టెలీ ప్రాంఫ్టర్ లేకుండానే ఆయన చదివిన వార్తలు తెలుగు ప్రజల హృదయాల్లో అతుక్కపోయేవి.

రచయితగా…

అయితే శాంతి స్వరూప్ బుల్లితెరపై వార్తలు చదవడమే కాదు.. రచయితిగా కూడా తన కలం నుండి పలు రచనలను సమాజానికి అందించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి “రాతిమేఘం” అనే నవలను రాశారు. అలాగే క్రికెట్ మీద పెరుగుతున్న ఆసక్తిని గమనించిన ఆయన “క్రేజ్” అనే నవలను.. సతి సహగమనానికి వ్యతిరేకంగా “అర్ధాగ్ని” అనే నవలను కూడా రాశారు. దూరదర్శన్ లో తనతో పాటు పనిచేస్తున్న సీనియర్ యాంకర్ రోజా రాణిని 1980లో వివాహం చేసుకున్న శాంతి స్వరూప్ కు ఇద్దరు పిల్లలు కాగా వారు ఐఐటీ పూర్తి చేసి విదేశాల్లో స్థిరపడ్డారు. బుల్లితెరకు 2011లో పదవి విరమణతో దూరం అయి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శాంతి స్వరూప్ శుక్రవారం ఉదయం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. తెలుగు మీడియా రంగంలో తొలి న్యూస్ రీడర్ గా టెలివిజన్ చానెల్ లో కనిపించిన ఆయన ఇటీవల కూడా కొన్ని సోషల్ మీడియాల్లో ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆయన గురించి నెటి తరానికి తెలిసింది.

You cannot copy content of this page