కాంట్రాక్టర్ల చేతిలో కాళేశ్వరం ఆలయం…

సెక్యూరిటీ చర్యలు కూడా..?

దిశ దశ, భూపాలపల్లి:

త్రిలింగ క్షేత్రం కాళేశ్వరం ఆలయ సెక్యూరిటీ చర్యలపై ఆందోళనలు నెలకొన్నాయి. దేవాదాయ శాఖకు చెందిన ఏ ఆలయంలోనూ లేని విధానం ఇక్కడ సాగుతోంది. దీంతో ఇక్కడకు వచ్చే భక్తులకు రాజగోపురం వద్దే గర్భాలయం దర్శనం చూపిస్తున్నట్టుగా తయారైంది. దేశంలోనే అరుదైన ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరున్ని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులపై స్థానిక కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది.

సెల్ ఫోన్ లాకర్…

కాళేశ్వరం క్షేత్రంలో భక్తులు మొబైల్స్ తీసుకెళ్ల కూడదన్న నిబంధనను అమలు చేస్తున్నారు. అయితే ఇందు కోసం భక్తులు మొబైల్స్ లోపలకు తీసుకెళ్ల కూడదన్న ప్రచారం అంతగా చేయడం లేదు. దేవాలయ ఆవరణతో పాటు ఆలయ గదుల వద్ద, ప్రైవేటు హోటల్స్ వద్ద, గోదావరి తీరంలో సెల్ ఫోన్స్ తీసుకెళ్లకూడదంటూ ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసినట్టయితే బావుండేది. కానీ స్వామి వారి దర్శనం కోసం రాజగోపురం వద్దకు వెల్లిన భక్తులు మాత్రం సెల్ ఫోన్ కాంట్రాక్టర్ నియమించిన ప్రైవేటు సైన్యం వ్యవహరిస్తున్న తీరు అసహనానికి కారణం అవుతోంది. వీరి చేతిలో నిలువుదోపిడీకి గురువతున్నంత పనవుతోందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. సెల్ ఫోన్లను లాకర్లలో డిపాజిట్ చేసుకునేందుకు మాత్రమే కాంట్రాక్టు తీసుకున్నప్పటికీ నిబంధనలకు విరుద్దంగా భక్తులను తనిఖీలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రాజగోపురం వద్దే సెల్ ఫోన్ లాకర్ ఏర్పాటు చేయడంతో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. దురుసుగా మాట్లాడుతూ… భక్తుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు డిటెక్టర్ తో కూడా వారే చెకింగ్ చేస్తున్నారు. వాస్తవంగా ఇతర ఆలయాల్లో సెల్ ఫోన్ లాకర్లు ఉన్నప్పటికీ భక్తులను తనిఖీ చేస్తే బాధ్యతలు టెంపుల్ సెక్యూరిటీ సిబ్బందికి మాత్రమే ఉంటుంది. కానీ కాళేశ్వరంలో మాత్రం సెల్ ఫోన్ లాకర్ కాంట్రాక్టర్ మనుషులే తనిఖీలు చేస్తూ, ఏకంగా డిటెక్టర్లను కూడా వినియోగిస్తుండడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. డిటెక్టర్లు వినియోగించాలంటే సెక్యూరిటీ అవసరాల కోసం అనుమతి అవసరమని కోరుతూ, ఇందుకు సంబంధించిన డాక్యూమెంట్లు కూడా సమర్పించిన తరువాత పోలీసు విభాగం నుండి అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. ఇలాంటి పర్మిషన్ కూడా సెక్యూరిటీ ఏజెన్సీలకు మాత్రమే ఇచ్చే సాంప్రాదయం ఉంది. అందులో సెక్యూరిటీ ఏజెన్సీలు రక్షణ చర్యలు చేపట్టిన కంపెనీల వివరాలు కూడా తెలుసుకుని ఆయా సంస్థల్లో డిటెక్టర్ల అవసరాలు ఎందుకు అన్న వివరాలు సేకరించాల్సి ఉంటుంది. కానీ కాళేశ్వరంలో మాత్రం సెల్ ఫోన్ లాకర్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న వారు డిటెక్టర్ వినియోగిస్తున్నారంటే వీరికి అనుమతులు ఉన్నాయా లేదా అన్నది అంతుచిక్కకుండా పోతోంది. సెల్ ఫోన్ లాకర్ కాంట్రాక్టర్ కు డిటెక్టర్ ఉపయోగించేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు నిబంధలు కూడా అనుకూలంగా ఉండవన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చారిత్రాత్మకమైన కాళేశ్వరం ఆలయంలో డిటెక్టర్లను ఉపయోగించాలంటే పురవాస్తు శాఖ క్లియరెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో అలనాటి వస్తువులు కాలగర్భంలో కలిసిపోయి భూమిలో కూరుకపోయాయి. ఇలాంటి వాటి కోసం కూడా ప్రైవేటు వ్యక్తులు డిటెక్టర్లను వినియోగించినట్టయితే పూర్వీకుల నాటి చరిత్ర ఆనవాళ్లు డిటెక్టర్ల ద్వారా గుర్తించి వాటిని పక్కదారి పట్టించే ప్రమాదం కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ దేవాదాయ శాఖ డిటెక్టర్ వినియోగానికి పర్మిషన్ తీసుకున్నట్టయితే ఆలయ ఉద్యోగులు, లేదంటే సెక్యూరిటీ సిబ్బందిచే తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది కానీ ఓ సెల్ ఫోన్ కాంట్రాక్టు కంపెనీకి ఈ డిటెక్టర్ ను ఎలా అప్పగిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.

You cannot copy content of this page