దద్దరిల్లుతున్న దండకారణ్యం
దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, బలగాలకు మధ్య యుద్ద వాతావరణం నెలకొంది. నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా బలగాలు కీకారణ్యాల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, వారిని మట్టుబెట్టేందుకు మావోయిస్టులు ఎత్తులు వేస్తున్నారు. దీంతో బస్తర్ పూర్వ జిల్లా అటవీ ప్రాంతం నుండి ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. శుక్రవారం దండకారణ్య అటవీ ప్రాంతంలోని వేర్వేరుగా జరిగిన రెండు ఘటనల్లో జవాన్లు గాయపడగా, మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది.
బీజాపూర్ లో…
చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి తిరుగు ప్రయాణం అయిన బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర ఒత్తిడికి గురి కావడంతో పేలుడు సంబవించింది. ఈ ఘటనలో ముగ్గురు DRG జవాన్లు గాయాలపాలైనట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి. స్వల్ప గాయాల బారిన పడిన జవాన్లకు ప్రాణాపాయం ఏమీ లేదని అధికారులు తెలిపారు.
ఒడిషా సరిహద్దుల్లో…
ఒడిషా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. గరియాబాద్ పోలీసులు, SOG, CRPF బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురు పడడంతో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు నక్సల్స్ మరణించినట్టుగా పోలీసు వర్గాల సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్న ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ఎదురు కాల్పులు అడపాదడపా చోటు చసుకుంటున్నట్టుగా సమాచారం. గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా, ఒరిస్సా సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడ సమీక్షిస్తున్నారు. ఈ ఎదురు కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది.