కవిత ఇంటికి చేరుకున్న కేటీఆర్, హరీష్
దిశ దశ, కరీంనగర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం అందుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావులు హైదరాబాద్ లోని కవిత ఇంటికి చేరుకున్నారు. ఆమెను కలిసిందేకు ప్రయత్నించినప్పటికి అధికారులు అనుమతించనట్టుగా తెలుస్తోంది. మరోవైపున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కవిత ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్నాయి. మద్యాహ్నం ఢిల్లీ నుండి కవిత ఇంటికి చేరుకున్న 10మంది ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. కవితను శుక్రవారం రాత్రి 8.45 ఫ్లైట్ లో తరలించేందుకు ఈడీ అధికారులు సన్నహాలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు కవిత ఇంటి వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాని మోడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కవిత ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అరెస్ట్ ఎలా చేస్తారు: కేటీఆర్ కొద్దిసేపటి తరువాత కవిత ఇంట్లోకి వెల్లిన బీఆర్ఎస్ వర్కింట్ ప్రసిడెంట్ కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వావాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్న ఎదురుదాడికి దిగారు కేటీఆర్. సుప్రీంకోర్టుకు చెప్పినట్టుగా నడుచుకోకపోతున్నందున అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని, సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్న ఈడి అధికారుల పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.