ఇప్పటంలో టెన్షన్.. టెన్షన్

గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలం ఇప్పటంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో నోటీసులు ఇచ్చిన ఎనిమిది కట్టడాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా ఇప్పటంలో పోలీసులు భారీగా మోహరించారు. అయితే కూలీ నాలీ చేసుకుని కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కూల్చేస్తుండటంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ ఆవేదనను పట్టించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అధికారులను హెచ్చరిస్తున్నారు.

కాగా, గతంలో ఇదే గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం చెలరేగడంతో అధికార యంత్రాంగం కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా మరోసారి మిగిలిన ఎనిమిది ఇళ్ల కూల్చివేత కోసం అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజుల క్రితమే ఈ ఎనిమిది ఇళ్లను కూల్చేందుకు అధికారులు రాగా.. స్థానికులు మున్సిపల్ కమిషనర్‌కు కలిసి కొంత సమయం కోరడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

అయితే గ్రామస్తులు అడిగిన సమయం ఇవాళ్టితో ముగియడంతో ముందస్తు సమాచారం ఇచ్చారు. దీంతో ఇవాళ మరోసారి కూల్చివేసేందుకు అధికారులు ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. అయితే ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ కొందరు కూల్చే సమయంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి కట్టుకున్న తమ ఇంటికి ఎలాంటి పరిహారం చెల్లించకుండా, కక్ష పూరితంగా కూల్చివేస్తున్నారంటూ ఆవేదన చెందారు. కాగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పోలీసుల జోక్యం లేకుండా అధికారులే గ్రామస్తులకు సర్దిజెప్పేందుకు యత్నిస్తుండగా.. వారు ఒప్పుకోవడం లేదు. దీంతో అధికారులు గ్రామస్తుల ఆవేదనను పట్టించుకోకుండా ఇళ్ల కూల్చివేతలను కొనసాగిస్తున్నారు.

You cannot copy content of this page