సర్కారు కాలేజీలో చేరండి… సౌకర్యాలు అందుకోండి…

నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తాం…

మంథని కాలేజీ అధ్యాపకుల వినూత్న ప్రచారం…

దిశ దశ, మంథని:

కార్పోరేట్ విద్యా వ్యవస్థతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతామని భావించకండి. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ అంతకన్నా ఎక్కువ స్థాయిలో ప్రామాణికతలు పాటిస్తున్నాం. మా కాలేజీ సాధించిన అద్భుతమైన ఫలితాలను గమనించండి అంటూ మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్, అధ్యాపకులు వినూత్న ప్రచారం మొదలు పెట్టారు. లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు విద్యా సంస్థలపై ఆధారపడడం మాని ప్రభుత్వ కాలేజీల్లో అందిస్తున్న విద్య గురించి దృష్టి సారిస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్తున్నారు. పెద్దపల్లి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిన మంథని బాలికల జూనియర్ కాలేజీ సాధించిన ఫలితాలపై అవగాహన చేసుకుని విద్యార్థులను తమకు అప్పగించినట్టయితే వారిని సుశిక్షుతులుగా తీర్చిదిద్దుతామని అంటున్నారు. మీ పిల్లలను మా కాలేజీలో చేర్పించండి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు మేం శ్రమించి తీరుతామంటూ సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు అనగానే ఆసక్తి ఉన్నవారు వచ్చి జాయిన్ అవుతారన్న భావనతో సరిపెట్టకుండా మంథని గర్ల్స్ కాలేజీ యంత్రాంగం చేస్తున్న ప్రచారం తీరు పలువురిని ఆకట్టుకుంటోంది.

ప్రైవేటుకు ధీటుగా…

ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రమే ఫలితాల ప్రకటన తరువాత ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తుంటాయి. ఓ వైపున పీఆర్వోల ద్వారా విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే మరో వైపున భారీ ఎత్తున యాడ్స్ కూడా ఇస్తుంటాయి. కానీ ప్రభుత్వ కాలేజీలు అడ్వర్టైజ్ మెంట్స్ ఇచ్చే విధానం అమల్లో లేకపోయినప్పటికీ సోషల్ మీడియాను అందిపుచ్చుకుని మరీ ప్రచారం చేపట్టారు. మంథని గర్ల్స్ కాలేజీ యంత్రాంగం ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే ప్రచారం చేస్తుండడం గమనార్హం. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన తరువాత కొన్ని ప్రభుత్వ కాలేజీలకు సంబంధించిన యంత్రాంగం ప్రచారం చేస్తుంటుంది. కానీ మంథని గర్ల్స్ కాలేజీ యంత్రాంగం మాత్రం ఇప్పటి నుండే తమ కాలేజీ ఘనకీర్తిని వివరిస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ కాలేజీలో ఫస్టీయర్ చదువుతున్న గుండోజు శ్రీజ 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించిన విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వ కాలేజీలో అందించే వివిధ రకాల సౌకర్యాల గురించి కూడా అందులో పేర్కొన్నారు.

మంథని ప్రభుత్వ బాలికల కాలేజీ బృందం చేస్తున్న ప్రచారానికి సంబంధించిన వివరాలేంటంటే..?

పదవ తరగతి పూర్తి చేసిన వాళ్ళు ఒక్కసారీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం… వాళ్ళు వీళ్ళు ఎక్కడో చదివిస్తున్నారు.. మనం కూడా అలాగే చేస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు.. మంథనీలో ఉన్నా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలకు వెళ్లి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది.. ఈ సంవత్సరం పెద్దపల్లి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది..465/470 మార్కులు సాధించిన కళాశాల విద్యార్తినీ గుండోజు శ్రీజ….ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ప్రభుత్వ కళాశాలలు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయి..
ప్రభుత్వ కళాశాలల్లో చేరిస్తే వచ్చే లాభాలు
1. ఉచితంగా అకాడమీ పుస్తకాల పంపిణీ
2. ఎంసెట్ లో ఏ కళాశాలలో సీటు వచ్చినా మొత్తం ఫీ ప్రభుత్వం చెల్లిస్తుంది.( ప్రైవేట్ లో చదివితే కేవలం 36 వేలు మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తుంది. మిగిలిన మొత్తం మీరే కట్టాలి)
3. ఒక్కో తరగతిలో తక్కువ మంది విద్యార్థులు
4. ఉపకార వేతనాలు వస్తాయి.
5. మంథని లో ప్రత్యేకంగా బాలికల కోసమే జూనియర్ కళాశాల…
6. కళాశాలలో మినరల్ వాటర్ ప్లాంట్
7. విశాలమైన తరగతి గదులు
8. ఎంతో నైపుణ్యం ఉన్న అధ్యాపకులు
9. ప్రతీ రోజు ఉదయం 5.30 గంటలకు వేక్అప్ కాల్..
10. చదువుతో పాటు వివిధ రకాల ఆటలు..
11. ప్రతి ఏడాది విహార యాత్రలు
12. ప్రతి విద్యార్థి మిద ప్రత్యేక శ్రద్ధ
13. పేరెంట్స్ – టీచర్ మీటింగులు
ఇలాంటి అవకాశాలు ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత.. తల్లిదండ్రులుపైన ఉంది..

You cannot copy content of this page