టీబీజీకేఎస్ సంచలన నిర్ణయం…
దిశ దశ, పెద్దపల్లి:
కారులో ప్రయాణించేందుకు విల్లు ససేమిరా అంటోంది. రెండు దశాబ్దాల అనుభందానికి ఇక బైబై చెప్పేస్తోంది. బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం ఇక నుండి స్వయం ప్రతిపత్తిగానే ముందుకు సాగుతాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టాన్ని చూపనున్న ఈ సంచలన నిర్ణయం కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉద్యమ ప్రస్థానం నుండి అండాదండా అందించిన కార్మిక సంఘం తనదారి తాను చూసుకోవాలని నిర్ణయించడం బీఆర్ఎస్ పార్టీకి ఆశనిపాతమే. లోకసభ ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ తీవ్రమైన ప్రతికూలతను ఎదుర్కొవలసి రానుంది.
23 సమావేశంలో
21 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకెఎస్) పార్టీతో ఉన్న అనుభందాని తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించింది. 23న సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి అనుభందం ఉండకూడదని నిర్ణయించారు. సింగరేణి ఏరియాలోని 11 డివిజన్లకు సంబంధించిన టీబీజీకెఎస్ కార్మిక సంఘ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై సంఘంలో అసంతృప్తి ఇంకా నెలకొనే ఉంది. దీంతో అందరూ కూడా సమాలోచనలు జరిపి సంఘం స్వయం ప్రకాషితం అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ స్వయం ప్రతిపత్తిగా ముందుకు సాగాలని నిర్ణయించారు. గని నుండి కేంద్ర కమిటీ వరకు కూడా పార్టీని నిర్మాణం చేయడం ఆయా కమిటీలను పునర్నిమాణం చేసుకోవడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. టీబీజీకెఎస్ ముఖ్యనేత మిర్యాల రాజిరెడ్డి నేతృత్వంలో 30 మందితో కూడిన స్క్రీనింగ్ కమిటీని కూడా వేశారు. సంఘాన్ని క్షేత్ర స్థాయి నుండి కేంద్ర కమిటీ వరకు కూడా గత వైభవం దిశగా నిర్మాణం జరపాలని ఈ సమావేశంలో తీర్మాణించారు. ట్రేడ్ యూనియన్ చట్టాల మేరకు, బైలాస్ కు అనుగుణంగా కార్మిక సంఘాన్ని నిర్వహించాలని… పెడరేషన్ కు అనుభందంగా కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించారు. అంశాల వారిగా మాత్రమే మద్దతు ఇవ్వాలని ఏ రాజకీయ పార్టీకి కూడా అనుభందంగా ఉండకూడదని టీబీజీకెఎస్ నిర్ణయించుకుంది. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులు మిర్యాల రాజిరెడ్డి, రామ్మూర్తిలు కూడా మీడియాకు వెల్లడించారు.
ప్రభావితం చూపనున్న నిర్ణయం…
తాజాగా టీబీజీకెఎస్ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2012, 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు సార్లు గెలిచి సత్తా చాటుకున్న టీబీజీకెఎస్ ను ప్రొఫెషర్ జయశంకర్ సార్ ప్రారంభించారు. ఉద్యమ భావజాలన్ని గనుల్లో మారు మోగించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ సంఘం తన లక్ష్యాన్ని అందుకోడంలో గ్రాండ్ సక్సెస్ అయింది. సకలజనుల సమ్మెలో కూడా గనిపై బొగ్గు ఉత్పత్తిని ఎక్కడిక్కడ స్తంభింపజేయడంలో సఫలం అయింది టీబీజీకెఎస్. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీలో ఉండకూడదని టీబీజీకెఎస్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పార్టీ ముఖ్య నాయకత్వం వెనకడుగు వేయడంతో టీబీజీకెఎస్ ముఖ్య నాయకులు మిర్యాల రాజిరెడ్డి, వెంకట్రావు, కెంగెర్ల మల్లయ్యతో పాటు పలువురు మూకుమ్మడిగా రాజీనామలు చేశారు. ఆ తరువాత సైలెంట్ గా ఉన్న కార్మిక సంఘ నాయకులు 23న సమావేశం ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్ పార్టీతో అనుభందాన్ని తెగతెంపులు చేసుకోవాలని తీర్మాణించారు. మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గుగనులు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో టీబీజీకెఎస్ పట్టు నిలుపుకుంది. కార్మికులతో పాటు వారితో అనుభందం ఉన్న కుటుంబాలపై కూడా సంఘం ప్రభావం ఉంటుంది. లోకసభ ఎన్నికల సమయంలో టీబీజీకెఎస్ స్వయం ప్రతిపత్తిగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకోవడం మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమే. లోకసభ ఎన్నికల్ల ఆయా జిల్లాల్లోని సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల వాతావరణం ఎదురయ్యే అవకాశాలు ఉండనున్నాయి. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి అనుభందంగా ఉన్న టీబీజీకెఎస్ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.