దిశ దశ, దండకారణ్యం:
చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. తుపాకుల తూటాలకు చిక్కి నక్సల్స్ మరణిస్తున్నారు. మావోయిస్టు పార్టీ ఏరివేతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుండడంతో అజ్ఞాత నక్సల్స్ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అభుజామఢ్ అటవీ ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర బలగాలు జల్లెడ పడుతుండడంతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ తరుణంలో షెల్టర్ జోన్లలో తల దాచుకోవాలని కేంద్ర కమిటీ దిశానిర్దేశం చేసినా బలగాలు మాత్రం నక్సల్స్ కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. కీకారణ్యాలతో పాటు గుట్టల్లో కూడా కూంబింగ్ ఆపరేషన్లు విస్తృతంగా చేపట్టడంతో మావోయిస్టు పార్టీ డిఫెన్స్ లో పడిపోయినట్టయింది. కేవలం 102 రోజుల్లోనే 121 మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల ఘటనల్లో చనిపోయారని వీరిలో 86 మంది హార్డ్ కోర్ నక్సల్స్ నేతలు ఉన్నారని బస్తర్ రేంజ్ పోలీసు అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఏ స్థాయిలో కొనసాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటి వరకు 173 మందిని అరెస్ట్ చేయగా, 179 మంది పోలీసుల ముందు లొంగిపోయారని వివరించారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్ల మావోయిస్టులను సమూలంగా ఏరివేయాలని కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటవీ ప్రాంతంలో బలగాలు డేగ కళ్లతో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. DRG, STF, CoBRA, CRPF, BSF, ITBP, CAF, బస్తర్ ఫైటర్స్ కు చెందిన బలగాలు అటవీ ప్రాంతంలో నక్సల్స్ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల ఉనికి ఏ మాత్రం బయటపడినా వారిని వెంటాడమే పనిగా పెట్టుకుని బలగాలు ముందుకు సాగుతున్నాయి.
ACM మృతి…
శనివారం ఉదయం బీజాపూర్ జిల్లా భైరంగడ్ నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు నక్సల్స్ చనిపోయారు. ఈ ఘటనలో అంబేలీ పేల్చివేత సూత్రధారి మట్వాడ LOS కమాండర్, ACM అనీల్ పూనెంతో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్టుగా పోలీసు అధికారులు ప్రకటించారు. నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని కూడా అధికారులు వెల్లడించారు.
నాడు అలా…
రెండున్నర దశాబ్దాల కాలంగా మావోయిస్టు పార్టీ దండకారణ్యాన్ని కంచుకోటగా మార్చుకుంది. భూంకాల్ మిలిషీయా పేరిట పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన అప్పటి పీపుల్స్ వార్ సమాంతర ప్రభుత్వాన్నే నిర్వహించే స్థితికి చేరుకుంది. భారత విప్లవోద్యమంలో సాధించిన విజయాల్లో బస్తర్ అడవుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపించడమేనని గర్వంగా చెప్పుకున్న పరిస్థితులు నాటివి. ఆ తరువాత మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ లో విలీనం అయిన తరువాత కూడా పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బలగాలను మందుపాతరలు పెట్టి పేల్చివేయడం, కవ్వింపు చర్యలకు పాల్పడి బలగాలను హతమార్చడం వంటి ఘటనలతో ప్రభుత్వానికి సవాల్ విసిరిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసిన సల్వా జుడూం వ్యవస్థాపకుడు మహేంద్ర ఖర్మను కూడా నక్సల్స్ చంపివేశారు. అటవీ ప్రాంతంలో ఎక్కడ మందుపాటర పేలుతుందో, ఎటువైపు నుండి తూటాల వర్షం కురుస్తోందనన్న భయానక పరిస్థితుల్లో అప్పుడు బలగాలు జీవనం సాగించాయి. కానీ గత ఏడాదిన్నర కాలంగా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కీకారణ్యాలపై తిరుగులేని పట్టు సాధించుకున్న నక్సల్స్ పై పైచేయి సాధిస్తూ బలగాలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర కమిటీ నుండి సాధారణ దళ సభ్యుని స్థాయి వరకు చాలా మంది బలగాల చేతికి చిక్కి చనిపోతున్నారు. గతంలో బస్తర్ అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయంటే ఎంతమంది జవాన్లు చనిపోయి ఉంటారోనన్న ఆందోళన వ్యక్తం అయ్యేది. కానీ ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు ఎధురయ్యాయి మావోయిస్టు పార్టీకి. అక్కడ ఎన్ కౌంటర్ జరుగుతోందన్న సమాచారం అందగానే మావోయిస్టు పార్టీకి చెందిన క్యాడర్ ప్రాణాలు కోల్పోయి ఉంటుందన్న ఆందోళనలు నెలకొనే పరిస్థితి తయారైంది.