దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ను ఉగ్ర మూలాలు వీడడం లేదా..? దర్యాప్తు సంస్థలకు ఏదో ఒక చోట కరీంనగర్ అనుబంధం బయట పడుతోందా..? తరుచూ జాతీయ దర్యాప్తు సంస్థ ఇక్కడే సోదాలు ఎందుకు చేస్తోంది..?
ఉత్తర తెలంగాణకు కేంద్రబిందువుగా ఉన్న కరీంనగర్ లో ఏదో ఒక రకంగా ఉగ్రమూలాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సద్దుమణిగిపోయిందనుకుంటున్న తరుణంలో మరోసారి ఉగ్ర లింకులు బయటపడుతుండడం ఆందోళన కల్గిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యకలాపాలు కూడా కరీంనగర్ లో బయటపడ్డాయి. తాజాగా ఆరు నెలల క్రితమే మస్కట్ వెళ్లి జీవిస్తున్న అశోక్ నగర్ వాసి తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. గతంలో పీఎఫ్ఐ ఇంఛార్జిగా వ్యవహరించిన తఫ్రీజ్ ఖాన్ ఇంట్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు కొన్ని డాక్యూమెంట్లు, బ్యాంకు అకౌంట్లతో పాటు ఇంటి నెంబర్లకు సంబంధించిన వివరాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా ఎన్ఐఏ అధికారులు తఫ్రీజ్ ఖాన్ కుటుంబ సభ్యుల నుండి కూడా వివరాలు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో కరీంనగర్ లోని తఫ్రీజ్ ఇంటికి చేరుకున్న పోలీసు అధికారులు ఉదయం 8.30 గంటల వరకు అక్కడే ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీపీ నరేందర్ తో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందస్తుగానే స్థానిక పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చిన ఎన్ఐఏ ఆఫీసర్లు బందోబస్తు నడుమ సోదాలు చేపట్టారు. ఇంటి ఆవరణలోకి ఎవ్వరిని కూడా అనుమతించకుండా తనిఖీలు చేపట్టడం గమనార్హం. అయితే తఫ్రీజ్ గతంలో పీఎఫ్ఐతో సంబంధాలు పెట్టుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు పూర్తి వివరాలను సేకరించేందుకే ఎన్ఐఏ అధికారులు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇతని కాంటాక్టులో ఎవరెవరు ఉన్నారు..? వారి నేపథ్యం ఏంటీ అన్న కోణంలో కూడా ఆరా తీసేందుకే వీరు రంగంలోకి దిగినట్టుగా భావిస్తున్నారు. పీఎఫ్ఐతో జరిగిన ఆర్థిక లావాదేవీలతో పాటు ఆయన ఏ క్యాడర్ లీడర్స్ తో టచ్ లో ఉండేవాడు..? ప్రత్యేకంగా శిక్షణ కోసం వెళ్లాడా..? మస్కట్ లో ఆయన చేస్తున్న కార్యకలాపాలు తదితర అంశాలపై వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. పీఎఫ్ఐ మూలాలను సమూలంగా క్లోజ్ చేయడంతో పాటు ఈ సంస్థను నిషేధించిన తరువాత ఉగ్రవాదులు కొత్త సంస్థలను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పీఎఫ్ఐతో అనుభందం ఉన్నవారిపై నిఘా కట్టుదిట్టం చేస్తున్నట్టు సమాచారం.
మూడేళ్లుగా…
పీఎఫ్ఐని నిషేధించకముందు నిజామబాద్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి రావడంతో అక్కడ కూపీ లాగిన ఎన్ఐఏకు లింకు కరీంనగర వరకు దొరికింది. జగిత్యాల పట్టణంలో రెండు సార్లు సోదాలు నిర్వహించగా, జగిత్యాల వాసి కరీంనగర్ లో ఉండగా అరెస్ట్ చేశారు. ఆ తరువాత కూడా ఓ సారి ఎన్ఐఏ అధికారులు కరీంనగర్ లో తనిఖీలు చేపట్టారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కరీంనగర్ టూ టౌన్ ఎదురుగా ట్యుటోరియల్స్ నడుపుతున్న వ్యక్తిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతనికి పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని అనుమానించిన కరీంనగర్ పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ప్రత్యేక నిఘా వేశారు. ఆ తరువాత ఎన్ఐఏ డైరక్ట్ గా ఉమ్మడి జిల్లాలోకి రావడం సోదాలు చేయడం రివాజుగా మారిపోయింది.