ఠాకూర్ పోయే… ఠాక్రే వచ్చే

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ఇంఛార్జి మాణిక్యం ఠాకూర్ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి బాధ్యతల నుండి తప్పుకున్నారు. సీనియర్ కాంగ్రెస్, జూనియర్ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోవడం రేవంత్ రెడ్డికి అనుకూలంగా జూనియర్ బ్యాచ్ రిజైన్ చేయడం జరిగింది. సీనియర్ బ్యాచ్ నేతలంతా సమావేశం అయి ఇంఛార్జి ఠాకూర్ తీరుపై మండిపడ్డారు. ఈ సమావేశానికి హాజరు కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులు కూడా సీనియర్ బ్యాచ్ తోనే తమ ప్రయాణం అని చెప్పారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు భగ్గుమన్నాయి. ఏఐసీసీ కూడా రాష్ట్ర వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మాణిక్యం ఠాకూర్ తన బాధ్యతల నుండి తప్పుకోవడం, ఆయన స్థానంలో మానిక్ రావు ఠాక్రేను నియమించింది ఏఐసీసీ. ఠాక్రే ముందుగా రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించి సీనియర్, జూనియర్ బ్యాచుల మధ్య సయోధ్య కుదర్చాల్సిన ఆవశ్యకత ఉంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమస్యలకు చెక్ పెట్టడం, పార్టీని బలోపేతం చేయడం వంటి కీలకమైన బాధ్యతలు ఠాక్రేపై ఉన్నాయి.

చికిత్స చేయకపోతే…

టీపీసీీసీ ఇంఛార్జి మానిక్ రావు ఠాక్రే ముందు పెను సవాళ్లు ఉన్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ముందుగా వర్గ విబేధాలకు చెక్ పెట్టాల్సి ఉంది. ముందుగా రేవంత్ రెడ్డి అంటేనే మండిపడుతున్న సీనియర్ బ్యాచ్ లీడర్లకు సర్ది చెప్పడంతో పాటు పీసీసీ చీఫ్ తో సమన్వయం కుదర్చాల్సిన పని అత్యంత ముఖ్యమైనది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకోవాలంటే ముందుగా గ్రూపు రాజకీయాలకు, ఒకరి పతనాన్ని మరోకరు శాసించే పరిస్థితిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తే పార్టీ ఊబీలో కూరుకపోయే ప్రమాదం ఉంటుంది తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం దొరకదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పీసీసీ కంటే ముందు…

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్న గ్రూప్ పాలిటిక్స్ కన్నా ముందు ఏఐసీసీ నేతలు ఒక్కతాటిపై నడవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి చెందిన కొంతమంది నాయకులు ఏఐసీసీ పెద్దలతో టచ్ లో ఉండడంతో వారికి ఇక్కడి సంగతులపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తుండడం వల్ల వారు ఏఐసీసీ ముఖ్యనేతలను ప్రభావితం చేస్తున్నారు. దీనివల్ల టీపీసీసీ నిత్యం వివాదాల కుంపటిపైనే ముందుకు సాగుతోందన్నది జగమెరిగిన సత్యం. అసలు రాష్ట్రంలో నెలకొన్న పంచాయితీలకు బ్రేకు వేసి పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు చొరవ తీసుకునే పని చేయడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఈ రాష్ట్రానికి ఓ ఇంఛార్జీని, పీసీసీ అధ్యక్షుడిని నియమించిన తరువాత ఇక్కడి వ్యవహరాలు చక్కబెట్టే బాధ్యతలను పూర్తి స్థాయిలో వారికే వదిలేస్తే బావుంటుంది కానీ ఇక్కడి పరిణామాలు ఢిల్లీ పెద్దలకు చేరవేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ లో ఏదో జరుగుతోందన్న భ్రమలకు చేరుకుని తరుచూ నాయకత్వ మార్పులు చేయడం వల్ల పార్టీ మరింత అబాసుపాలవుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఓ రాష్ట్రానికి ఇద్దరు ముఖ్య బాధ్యులను అప్పగించిన తరువాత కూడా వారి ద్వారా సమీకరణాలు జరపాల్సిన పరిస్థితి నుండి ప్రత్యామ్నాయ నాయకత్వం వైపు చూస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. దీనివల్ల ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

You cannot copy content of this page