దిశ దశ, జగిత్యాల:
రాష్ట్రంలోనే ఆ జిల్లా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నిత్యం ఏదో ఒక ఘటనతో జిల్లా పేరు పతాక శీర్షికన నిలుస్తోంది. 33 జిల్లాల్లోనే ఆ జిల్లా హైలెట్ అవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లా ఏదో రకంగా చర్చల్లో నానుతుండడం గమనార్హం.
సంచలనాలకు కేరాఫ్
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ఉనికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రేస్ కాగా ఇందుకు సంబంధించిన మూలాలను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్ఐఏ గుర్తించింది. ఈ సంస్థతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సోదాలు నిర్వహించింది. ఆ తరువాత కొంతకాలం స్తబ్దంగా ఉన్నప్పటికీ తరుచూ జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో లేకుండా మాత శిశు సంరక్షణ కేంద్రంలో తరుచూ ఏదో ఒక ఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే ప్రజా వాణి వేదికగా పలువురు ఇచ్చిన దరఖాస్తులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. జగిత్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని, వాటిని విక్రయించేందుకు చొరవ తీసుకోవాలని కోరుతూ ప్రజా వాణిలో దరఖాస్తు చేయడం కలకలం సృష్టించింది. నాచుపల్లి గ్రామ వార్డు మెంబర్ పెంచుకుంటున్న కుక్కకు వ్యాక్సిన్ వేయించకపోవడంతో గ్రామస్థులం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని, తగిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అలాగే ఇంతకుముందు జగిత్యాల కలెక్టర్ గా పని చేసిన రవి హామీ ఇవ్వడంతో తాను మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పనులు చేశానని ఇందుకు బిల్లులు మంజూరు కావడం లేదంటూ ఓ సర్పంచ్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అలాగే జగిత్యాల బల్దియాకు గత నాల్గేళ్లలో ఏకంగా 10 మంది కమిషనర్లు బదిలీ కావడం ఒక ఎత్తైతే, మునిసిపల్ ఛైర్ పర్సన్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై ఆరోపణలు గుప్పించారు. అప్పటికే ఆమెపై అవిశ్వాస తీర్మాణం పెట్టాలని కౌన్సిలర్లు సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో ఆమె ముందస్తుగా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ కూడా పిలిపించి మాట్లాడినా ఆమె తాను వెనక్కి తగ్గేది లేదని చెప్పడంతో రాజీనామా ఆమోదించారు. దీంతో రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఛైర్ పర్సన్ రాజీనామాను ఆమోదించిన తొలి చరిత్ర జగిత్యాలకే దక్కింది. తాజాగా జగిత్యాలలో ఆపరేషన్ చేయించుకున్న మహిళ గర్బంలో న్యాప్ కిన్ ఉంచిన ఘటన వెలుగులోకి రావడం మరో సంచలనంగా మారింది. ఈ న్యాప్ కిన్ ఘటనపై విచారణ జరపేందుకు ఏకంగా త్రి సభ్య కమిటీ వేయడంతో పాటు రెండు సార్లు విచారణ జరిపింది ఇందుకు సంబంధించిన నివేదికను వైద్య విధాన పరిషత్ కమిషనర్ తో పాటు మంత్రి హరీష్ రావుకు పంపించడం గమనార్హం. తమకు నిధులు విడుదల చేయకుండా సామూహికంగా రాజీనామాలు చేస్తామంటూ సర్పంచులు అధికారులకు లేఖలు ఇవ్వడం కూడా ఇదే జిల్లాలో చోటు చేసుకుంది.
ఎలక్షన్ పిటిషన్ విషయంలోనూ…
ఇకపోతే జిల్లాలోని ధర్మపురి ఎన్నికల కౌంటింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన బెంచ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బిక్షపతిని, కౌంటింగ్ కు సంబందించిన ఫామ్స్ ను తన ముందు ఉంచాలని మల్కాజ్ గిరీ డీసీపీని ఆదేశించింది. దీంతో బిక్షపతి హుటాహుటిన జగిత్యాల కలెక్టర్ ను కలిసి పరిస్థితిని వివరించి హై కోర్టు ఉత్తర్వులను అందించారు. దీంతో జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ భాషా ఆద్వర్యంలో ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూం గదిని తెరిచి హైకోర్టు అడిగిన ఫామ్స్ తీయాలని నిర్ణయించారు. అయితే అనూహ్యంగా స్ట్రాంగ్ రూంలకు సంబంధించిన తాళాలు ఓపెన్ కాకపోవడం కలకలం సృష్టించింది. తాళం చేతులు మిస్సయ్యాయని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపిస్తే, తాళాలు ఓపెన్ కావడం లేదని కలెక్టర్ యాస్మిన్ భాషా ప్రకటించారు. ఇందుకు సంబందించిన నివేదికను జిల్లా యంత్రాంగం హై కోర్టుకు సమర్పించగా, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా సమగ్ర వివరాలతో కూడిన పిటిషన్ ను హైకోర్టు బెంచ్ ముందు ఉంచారు. దీంతో హై కోర్టు తాళం చేతుల మిస్సింగ్ మిస్టరీపై విచారించాలని ఈసీఐని ఆదేశించింది. దీంతో ఈసీఐకి చెందిన అధికారుల బృందం జగిత్యాల కలెక్టర్లుగా పని చేసిన ముగ్గురితో పాటు ఎన్నికల కౌంటింగ్ లో విధులు నిర్వర్తించిన వారిని కూడా విచారించింది. ఈ నివేదికను ఈ నెల 26లోగా ఈసీఐ హై కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో హై కోర్టు తాళాలను పగలగొట్టి రికార్డులు తమకు అప్పగించాలని జగిత్యాల కలెక్టర్ ను ఆదేశించింది. దీంతో ఆదివారం జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ భాషా సమక్షంలో తాళాలను పగలగొట్టి 17ఏ, బీ, సీ ఫామ్స్ ను సేకరించి సీల్డ్ కవర్లో హైకోర్టుకు పంపించనున్నారు జిల్లా ఎన్నికల అధికారులు. ఇలా తరుచూ ఏదో రకంగా జగిత్యాల జిల్లా చర్చల్లో నిలుస్తుండడం గమనార్హం.