కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు
దిశ దశ, కరీంనగర్:
ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. శనివారం తెల్లవారు జామను స్థానిక ప్రతిమ హోటల్ పై పోలీసులు చేసిన దాడిలో దొరికిన రూ.6.60 కోట్లు ఓటర్లకు పంచేందుకే సిద్దం చేశారన్నారు. ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో ఓట్లు కొనే ప్రయత్నం
లో భాగంగానే భారీ మొత్తలంలో డబ్బును దిగమతి చేసి పెట్టుకున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోయిన వినోద్ కుమార్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తపనతో ఓటుకు నోటు విధానం అవలంభించేందుకు పథకం పన్నారని రాజేందర్ రావు వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ది కోసం పాటుపడినట్టయితే ప్రలోభాలకు గురి చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిమ మల్టీప్లెక్స్ భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ బంధువులకు చెందింది కాబట్టి అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నాడని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. వినోద్ కు సంబంధించిన బంధువులతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ మొత్తంలో నగదు దాచిపెట్టారని, అదంతా కూడా స్వాధీనం చేసుకోవలని కోరారు. కరీంనగర్ కదనభేరి సభకు హాజరయ్యేందుకు కూడా ప్రజల నుండి విముఖత రావడంతో డబ్బులిచ్చి జనాలను తరలించారని ఆరోపించారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కావడం, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ గణనీయంగా తగ్గిపోవడంతో ఈ ఎన్నికల్లో గెలవడం అంత సులువు కాదని గమనించే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నాడని వెలిచాల రాజేందర్ రావు మండిపడ్డారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తీసుకొచ్చిన డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులను అభినందనలు తెలియజేశారు. ఒకప్పుడు ‘‘మేము తప్పు చేస్తే రాళ్లతో మమ్మల్ని తరిమి తరిమి కొట్టండి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారని, ఇప్పుడా పరిస్థితి ఆసన్నమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న బీఆర్ఎస్ పార్టీ లోకసభ ఎన్నికల్లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతోంది కానీ ప్రజల్లో మాత్రం సానుకూలత లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వెలిచాల రాజేందర్ రావు అన్నారు. అబద్దాన్ని పదే పదే వల్లెవేసి దానిని నిజమని నమ్మించే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీ దిగజారుడు తనాన్ని గుర్తించే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో కల్లబొల్లి మాటలు చెప్తూ కాలం వెల్లదీసి తమ ఆస్తులను పెంచుకునేందుకు అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీని అక్కున చేర్చుకునే అవకాశం లేదన్న విషయాన్ని గమనించాలని రాజేందర్ రావు హితవు పలికారు.