ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మరో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈడీ, సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి కొన్ని గంటల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది… రేపు కవితను విచారించే విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న చర్చ మొదలైంది. ఈ స్కాంలో నిందితునిగా ఉన్న అరుణ్ పిళ్లై రౌస్ అవెన్యూ కోర్టులో వేసిన పిటిషన్ సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ కవితకు తాను బినామీనంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉప సంహరించుకుంటున్నాని పిటిషన్ లో పిళ్లై పేర్కొన్నారు. కవిత ప్రయోజనాల కోసమే తాను పని చేశానంటూ వాంగ్మూలం ఇచ్చిన పిళ్లై ఇప్పుడు స్టేట్ మెంట్ రిటర్న్ తీసుకుంటున్నానంటూ వేసిన పిటిషన్ సరికొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు 29 సార్లు ఈడీ ముందు హాజరైన పిళ్లై నుండి 11 సార్టలు స్టేట్ మెంట్ రికార్డు చేసింది. గత ఐదు రోజులుగా ఈడబీ కస్టడీలో ఉన్న అరుణ్ పిళ్లైని 100 కోట్ల లిక్కర్ స్కాం వ్యవహారం గురించి ప్రశ్నిస్తున్నారు. కెమెరా ముందు జరిపిస్తున్న ఈ విచారణ సమయంలోనే తాను కవిత విషయంలో చెప్పిన వాంగ్మూలాన్ని వాపస్ తీసుకుంటున్నట్టు వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కూడా ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈడీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుందోనన్నదే వేచి చూడాల్సి ఉంది. అయితే కవిత విషయంలో పిళ్లై యూ టర్న్ తీసుకోవడంతో రేపు కవితను విచారిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.