దిశ దశ, హైదరాబాద్:
ప్రేమించడం లేదన్న కసితో ప్రియుడు యువతులపై యాసిడ్ దాడి చేసిన ఘటనలు విన్నాం… తనను ప్రేమించి మోసం చేసిందన్న అక్కసుతో హత్యలకు పాల్పడిన ప్రియుడి ఘనకార్యాలనూ కన్నాం… కానీ ఈ క్రైం కాస్తా డిఫరెంట్ గానే ఉంది. తనకు బ్రేకప్ ఇచ్చాడన్న కోపంతో రగిలిపోయిన ఓ మాజీ ప్రియురాలు వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. జూబ్లీ హిల్స్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయనట్టయితే ఓ యువకుడు అర్థాంతరంగా జైలు జీవితం గడపాల్సి వచ్చేది కాగా ఇందుకు కుట్ర పన్నిన నిందులు దర్జాగా బయట తిరిగే వారు. కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి మరీ అసలు విషయాలను రాబట్టి అసలు నిందితులను అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ మహానగరంలోని రహమత్ నగర్ లో నివాసం ఉంటున్న రింకీ అమీర్ పేటలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తోంది. సరూర్ నగర్ లో నివాసం ఉంటున్న శ్రవణ్ అనే యువకుడు కూడా అమీర్ పేట ప్రాంతంలోనే ఉపాధి పొందుతున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమ వరకు వెల్లినప్పటికీ కొంతకాలం తరువాత శ్రవణ్ రింకీతో సాన్నిహిత్యంగా ఉండడం తగ్గించాడు. తన ప్రేమకు శ్రవణ్ బ్రేకప్ ఇచ్చాడని గ్రహించిన రింకి పకడ్భందీ వ్యూహంతో అతనిని పోలీసులకు పట్టించే ప్రయత్నం చేసింది. రోజు రోజుకు తన మాజీ ప్రియుడిపై పెరుగుతున్న పగ తీర్చుకునేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇందుకు తన స్నేహితులను వాడుకుని శ్రవణ్ కారులో 40 గ్రాముల గంజాయి పెట్టేందుకు ఏర్పాట్లు చేసింది. తన మాజీ ప్రియుడితో పబ్ కు తీసుకెళ్లిన రింకీ శ్రవణ్ కారులో తన స్నేహితులతో గంజాయి ప్యాకెట్లను ఉంచేలా జాగ్రత్త పడింది. అనుకున్న ప్రకారం తమ స్కెచ్ ఫలించిందని కలలు కన్న రింకీ పోలీసులకు ఫోన్ చేసి శ్రవణ్ కారు నంబరు చెప్పి అందులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పింది. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు శ్రవణ్ కారును తనిఖీ చేసి అందులో దొరికిన గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని అతన్ని స్టేషన్ కు తరలించారు.
అనుకున్నదొక్కటి…
డ్యామిట్ కథ అడ్డం తిరిగిందన్న రీతిలో పింకీ అంచనాలు తలకిందులయ్యాయి. అజ్ఞాత యువతి ఇచ్చిన సమాచారం ప్రకారం గంజాయి కారులో దొరకడంతో అతనే స్మగ్లింగ్ చేస్తున్నాడని పోలీసులు నమ్మారు. అయితే గంజాయి వంటి అక్రమ దందా తాను చేయనని తనకెలాంటి సంబంధం లేదని పదేపదే పోలీసుల ముందు శ్రవణ్ చెప్పుకున్నాడు. కారులో దొరికిన గంజాయి ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసేందుకు సమాయత్తం అయిన పోలీసులు అతని వేదనను గమనించి క్రాస్ చెక్ చేశారు. దీంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం శ్రవణ్ కు ఎలాంటి నేర చరిత్ర లేదని తేలింది. అంతే కాకుండా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడేందుకు అతను వ్యాపారం చేయడం కానీ, కస్టమర్లతో ఛాటింగ్ చేయడం కానీ… ఫోన్ కాల్స్ ద్వారా దందా చేస్తున్నాడా అన్న విషయాలను కూడా తెలుసుకునేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకుని సమగ్రంగా ఆరా తీశారు. గంజాయి అక్రమ దందా చేసే వాళ్లతో అతనికి ఎలాంటి సంబంధాలు లేవని, ఇంతవరకు గంజాయి మాఫియతో కూడా సంబంధాలు లేవని గుర్తించిన పోలీసులు శ్రవణ్ తమకు వివరించిన వివరాలన్ని నిజమేనని రూఢీ చేసుకున్నారు. ఆ తరువాత తమకు సమాచారం ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని జూబ్లీహిల్స్ పోలీసులు నిర్ణయించారు. గంజాయి స్మగ్లింగ్ అవుతున్న విషయం గురించి సమాచారం ఇచ్చిన అమ్మాయిని స్టేషన్ కు పిలిపించిన పోలీసులు ఫలానా నంబరు కారులో గంజాయి రవాణా అవుతోందన్న విషయం నీకెలా తెలుసని ప్రశ్నించారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన సమాచారం రోజు కానీ, ఆ తరువాత కానీ ఆమె ఎలా వ్యవహరించింది అన్న వివరాలను కూడా సేకరించారు. పోలీసులు అనుమానంతో ఆమెను పలు రకాలుగా క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో రింకి పోలీసుల ముందు తాను చేసిన తప్పు ఒప్పుకుంది. తన ప్రేమకు బ్రేకప్ ఇచ్చాడన్న అక్కుసుతోనే తానీ పనికి ఒడిగట్టానని రింకీ అసలు కధ అంతా పోలీసుల ముందు వివరించింది. దీంతో రింకీతో పాటు ఈ కేసులో ఆమెకు సహకరించిన ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
గంజాయి గుట్టు ఎలా తెలిసిందో..?
ఓ ప్రైవేటు ఫైనాన్స్ లో పనిచేస్తున్న రింకీకి గంజాయి ఎక్కడ దొరికింది..? ఆమెకు విక్రయించింది ఎవరూ అన్న చర్చ కూడా మొదలైంది. సాధాసీదా జీవనం సాగిస్తున్న వారికి గంజాయి అంత సులువుగా లభ్యం అయిందంటే మహానగరంలో గంజాయి ఎంత మేర గుభాళిస్తుందో అర్థం చేసుకోవచ్చు.