పోలీసుల చాకచక్యంతో నిందితుడి అరెస్ట్…
దిశ దశ, కాటారం:
వివాహేతర బంధాన్ని తెగతెంపులు చేసుకున్నందుకు కేసులో ఇరికించాలని అనుకున్న ఓ ప్రబుద్దుడి ప్రయత్నానికి కాటారం పోలీసులు చెక్ పెట్టారు. కొంతకాలం సహజీవనం చేసి తన జీవితం నుండి వెళ్లిపోయినందుకు ఆమెను కటకటాల పాలు చేయాలన్న ప్రయత్నంలో అతనే అరెస్ట్ అయ్యాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి వృద్దురాలి హత్య కేసును ఛేదించారు.
వివరాల్లోకి వెల్తే…
జిల్లాలోని కాటారం మండలం ఆదివారంపేట గ్రామంలో ఈ నెల 12వ తేది రాత్రి 10.30 గంటల సమయంలో ఓడేటి మల్లక్క (67) దారుణ హత్యకు గురైంది. ఈ సమాచారం అందుకున్న కాటారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒంటరిగా ఉంటున్న మల్లక్కను ఎవరు చంపారన్న విషయంపై ఆరా తీసే పనిలో నిమగ్నం అయిన పోలీసులు కేసు డిటెక్ట్ చేసేందుకు పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వృద్దురాలిని చంపిందెవరు..? ఆమెను చంపేంత దారుణానికి ఒడిగట్టడానికి అసలు కారణమేంటీ అన్నది తేలితే అసలు విషయం బయటకు వస్తుందని భావించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితులపై దృష్టి సారించడంతో పాటు సాంకేతికతను కూడా అందిపుచ్చుకుని ముందుకు సాగారు. చివరకు మల్లక్కను చంపింది కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ సమీపంలోని బారెగూడకు చెందిన మోరలే శివ (42)గా గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.
అంచనాలు తలకిందులు…
శివ మల్లక్కను హత్య చేసేందుకు వేసుకున్న పథకం అంతా ఇంతా కాదు. తనతో సహజీవనం చేసిన మహిళ విడిచి వెల్లిపోవడంతో ఆమెను తనదరికి చేర్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అతని నడవడిక నచ్చక సదరు మహిళ శివతో కలిసి జీవించేందుకు ససేమిరా అనడంతో ఆమెను కేసులో ఇరికించాలని భావించి భారీ స్కెచ్ వేశాడు. వృద్దురాలిని చంపి ఆ కేసు ఆ మహిళపై వేయాలని భావించి కొంతకాలంగా మల్లక్కతో సాన్నిహిత్యంగా మెదిలినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లక్క పేరిట ఉన్న ఆస్తి కోసం సదరు మహిళనే మర్డర్ ప్లాన్ చేసి ఉంటుందన్న పోలీసులు అనుమానిస్తారని కలలు కన్నాడు. అయితే కాటారం పోలీసులు మాత్రం మల్లక్క హత్య జరిగిన తరువాత కూపీ లాగడంతో అసలు విషయం బట్టబయలు అయింది. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితుడు మొబైల్ స్విచ్ఛాప్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ దర్యాప్తు చేసిన అధికారులకు మాత్ర అతనిపైనే అనుమానం కల్గింది. సాంకేతితకతో పాటు ఇన్వెస్టిగేషన్ విషయంలో వివిధ కోణాలను ఆవిష్కరించిన పోలీసులు మల్లక్కను చంపింది శివగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. కాటారం సబ్ డివిజన్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరుతో నిందితుని అంచనాలు తలకిందులు అయ్యాయి. శివను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు కాటారం పోలీసులు. మల్లక్క హత్య కేసును కాటారం డీఎస్పీ రాంమెహన్ రెడ్డి నేతృత్వంలో సీఐలు రామచందర్ రావు, నాగార్జున, ఎస్సైలు అభినవ్, శ్రీనివాస్ లు దర్యాప్తు చేసిన తీరుపై జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.