దిశ దశ, దండకారణ్యం:
దండకారణ్య అటవీ ప్రాంతంలో మారణహోమం సాగుతూనే ఉంది. మావోయిస్టులు, బలగాల మధ్య పోరు ప్రచ్ఛన్న యుద్దాన్ని మరిపిస్తోంది. తాజాగా సీఏఎఫ్ కమాండర్ ను మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపిన ఘటన సంచలనంగా మారింది. చత్తీస్ గడ్ ప్రభుత్వం శాంతి చర్చల ప్రతిపాదనకు సానుకూలంగా ఉన్నామని తమ డిమాండ్లకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించిన క్రమంలో కమాండర్ హత్య జరగడం గమనార్హం. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కుట్రు ఏరియాలోని దర్బా క్యాంపునకు చెందిన బలగాలు ఆదివారం ఉదయం స్థానిక మార్కెట్ కు వెళ్లాయి. అక్కడ నిత్యవసరాలను కొనుగోలు చేుస్తున్న క్రమంలో సీఏఎఫ్ కమాండర్ తేజౌ రాం భూర్యాను గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటనకు సింగిల్ యాక్షన్ టీం పాల్పడినట్టుగా భావిస్తున్నారు. క్యాంపులో ఉన్న పోలీసు బలగాలు, టార్గెట్లు సంచరిస్తున్నప్పుడు వారిపై దాడులు చేసేందుకు స్పెషల్ గా యాక్షన్ టీమ్స్ ను రంగంలోకి దింపినట్టుగా అంచనా వేస్తున్నారు. యాక్షన్ టీమ్ దాడి జరిపిన నేపథ్యంలో బీజాపూర్ జిల్లాలోని ప్రాబల్య ప్రాంతాల్లో బలగాలను అప్రమత్తం చేశారు. కమాండర్ ను చంపిన వారి కోసం కూడా కుట్రు ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.