దిశ దశ, కరీంనగర్:
ప్రశ్నార్థకంగా మారిన కార్మిక సంఘాలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. స్వ రాష్ట్రం సిద్దించిన తరువాత ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్వీర్యంగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఉద్యమ ప్రస్థానంలో సకలజనుల సమ్మెతో ఇతర రకాలుగా నిరసనలకు పూనుకున్న ఆర్టీసీ కార్మిక సంఘాలన్ని కూడా గత తొమ్మిదేళ్లుగా మూగబోయాయి. అప్పటి ప్రభుత్వం కార్మిక సంఘాల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో యూనియన్ల ప్రతినిధులు కూడా గమ్మునుండి పోవల్సి వచ్చింది. దీంతో ఆర్టీసీలో యూనియన్లు అన్న పదం వినిపించని పరిస్థితే తయారైంది. తొమ్మిదేళ్ల పాలనలో నామమాత్రంగా ప్రభుత్వం అండగా నిలచింది తప్ప కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోలేదన్న వేదన ఆర్టీసీ వర్కర్స్ లో పెల్లుబికిపోయింది. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించి చేతులు దులుపుకుంది తప్ప ఇతరాత్ర చర్యలు చేపట్టలేదు. దీంతో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయింది అన్న ఒకే ఒక సంబరం తప్ప దాని ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు అందాల్సిన బెనిఫిట్స్ మాత్రం ఇంతవరకు అందలేదు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమకు కల్పించాల్సిన ఇతరాత్ర హక్కుల విషయంలోనూ ప్రశ్నించే పరిస్థితి నాడు లేకుండా పోయిందన్న వేదన ఉద్యోగుల్లో వ్యక్తం అయింది.
రంగంలోకి యూనియన్…
ఇకపోతే ఇంతకాలం ఎవరికి వారే అన్నట్టుగా కాలం వెల్లదీస్తున్న కార్మికులను ఏకతాటిపైన నడిపించేందుకు ఐఎన్ టీయూసీ అనుభంద సంఘం అయిన స్టాఫ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుట్టింది. యూనియన్ బలోపేతంతో పాటు ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు జరిగిన నష్టాల గురించి వివరిస్తూ కార్మికులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. ఎస్ డబ్లు యూ ఆధ్వర్యంలో తొలి సమావేశం మంగళవారం కరీంనగర్ ఇందిరా గార్డెన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు జరిగిన అన్యాయం, హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై యూనియన్ నాయకులు ప్రసంగించారు. కరీంనగర్ రీజియన్ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశాల ద్వారా కార్మికులను చైతన్య పర్చి గత వైభవాన్ని సంతరించుకునే విధంగా చర్యలు చేపట్టాలని స్టాఫ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా కార్మికులను కలిసి ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల అక్కడి కార్మికులకు కల్గిన లాభాలు, తెలంగాణాలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపించింది తదితర అంశాల గురించి కార్మికులందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కరీంగనర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ సయ్యద్ మహమూద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి రాజిరెడ్డి, స్టేట్ వైస్ ఛైర్మన్ జక్కుల మల్లేశం గౌడ్, రీజియన్ అధ్యక్షుడు టీఆర్ రెడ్డి, కార్యదర్శి ఎన్ కె రాజు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు హాజరయ్యారు.