మా గతి ఇంతేనా… మేమెలా బ్రతకాలి..?

ఎంపీని ప్రశ్నించిన మేడిగడ్డ బాధిత రైతులు

దిశ దశ, దండకారణ్యం:

తమ చేతికి పరిహారం అందించే వరకూ వదిలిపెట్టేది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మేడిగడ్డ బ్యారేజీ బాధిత రైతులు. నోటిఫై చేసిన భూముల తాలుకు డబ్బులు వెంటనే ఇప్పించాలని, అదనంగా ముంపునకు గురవుతున్న భూముల సర్వే పూర్తి చేసి వాటిని కూడా నోటిఫై చేయాలన్న డిమాండ్ తో పోరుబాట పట్టిన సరిహద్దు రైతులు మంగళవారం గడ్చిరోలి ఎంపీ అశోక్ నేతేను కూడా ప్రశ్నించారు. సిరొంచలో పర్యటించిన ఆయన తాలుకా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై రివ్యూ జరిపిన నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ బాధిత గ్రామాల రైతులు అక్కడకు చేరుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. ఐదేళ్లుగా తాము నరకం చూస్తున్నామని తమకు పరిహారం ఇప్పించడంలో చొరవ తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ తో తమ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట చేసిన సర్వే ప్రకారం నోటిఫై చేసిన భూములకు పూర్తి పరిహారం నేటికీ అందలేదన్నారు. అలాగే అదనంగా కూడా ముంపునకు గురవుతున్న భూములకు కూడా పరిహారం ఇప్పించాలని వేడుకున్నారు. వ్యవసాయ భూములన్ని మేడిగడ్డ బ్యారేజీలో మునిగిపోవడంతో సాగు చేసుకోలేక కుటుంబాలను పోషించలేక అవస్థలు పడుతున్నామని విన్నవించారు. తమకు పరిహారం ఇచ్చే వరకూ బ్యారేజీలో నీటి నిలువ ఉంచకూడదని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అశోక్ నేతే మాట్లాడుతూ… మేడిగడ్డ బాధిత రైతులకు పరిహారం ఇఫ్పించే విషయంలో ఇప్పటికే తెలంగాణ సర్కారుకు లేఖ రాశామని బాధిత రైతులకు సాయం అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామన్నారు. అయితే తమకు ఇవ్వాల్సిన పరిహారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుండి స్పందన రావడం లేదని, నాలుగు నెలల క్రితమే పరిహారం ఇవ్వాలని లేఖ రాసినా నిధులు విడుదల చేయడం లేదని బాధిత రైతులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రాంత అధికారిని సమాధానం చెప్పాలని ఎంపీ అశోక్ నేతే సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చే విషయంలో సానుకూలంగానే ఉందని నిధులు విడుదలకు సంబంధించిన ప్రాసెస్ నడుస్తుందని వివరించారు. వీలైనంత తొందరగా పరిహారం తాలుకు డబ్బులు రైతుల చేతికి అందుతాయని ప్రకటించారు. అయితే తమ భూములకు సంబంధించిన పరిహారం చేతికి వచ్చే వరకూ బ్యాక్ వాటర్ స్టోర్ చేయవద్దని, నీటిని దిగువకు వదిలేయాలని బాధిత రైతులు స్పష్టం చేశారు. ఇందుకు గడ్చిరోలీ ఎంపీ అశోక్ నేతే స్పందిస్తూ రైతులకు నష్టం జరుగుతున్నందున పరిహారం ఇచ్చే వరకూ మేడిగడ్డలో బ్యాక్ వాటర్ నిలువ ఉంచకూడదన్నారు.

నేటి నుండి నిరసన…

మరోవైపున మేడిగడ్డ రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం బుధవారం నుండి నిరసన దీక్షలు చేపట్టనున్నారు. గతంలో దీక్షలు చేస్తున్న క్రమంలో నాగపూర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కలిసి బాధిత రైతులు తమ బాధలు చెప్పుకున్నారు. ఇందుకు స్పందించిన ఆయన మేడిగడ్డ బాధిత రైతులకు పరిహారం ఇప్పించేందుకు చొరవ తీసుకుంటామని వెల్లడించారు. ఆ తరువాత జిల్లా కలెక్టర్, సిరొంచ తాలుకా అధికారులు బాధిత రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు సేకరించడంతో తమ చేతికి పరిహారం అందినట్టేనని రైతాంగం సంబరపడిపోయింది. అయితే తెలంగాణ ప్రభుత్వం నుండి మేడిగడ్డ బాధితుల పరిహారం విషయంలో స్పందన రాకపోవడంతో బాధిత గ్రామాల రైతులు మళ్లీ నిరసన బాట పట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవలే స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. బుధవారం నుండి మళ్లీ నిరసన దీక్షలకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో బాధిత గ్రామాల తమకు డబ్బులు ఇచ్చే వరకూ ఈ దీక్షలను ముగించవద్దని నిర్ణయించుకున్నారు. అయితే సిరొంచ ఏరియాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నలుగురికి మించి ఎక్కువ మంది ఉండకూడదని పోలీసులు బాధిత గ్రామాల రైతులకు వెల్లడించారు. దీంతో మేడిగడ్డ బాధిత రైతులు కూడా నిభందనలకు అనుగుణంగా రోజుకు నలుగురు చొప్పన నిరసన దీక్షల్లో కూర్చోవాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా తయారు చేశారు. ఈ దీక్షల్లో కొత్తగా మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తిన తరువాత ముంపునకు గురువుతున్న దిగువ ప్రాంత బాధిత రైతులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన అంకీస, ఆసరెల్లి వరకు కూడా గేట్లు ఎత్తి నీటిని వదిలినప్పుడల్లా పంటలు ముంపనకు గురవుతున్నాయని దీంతో తాము పంటలు వేసి నష్టపోతున్నామన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి మేడిగడ్డ బ్యాక్ వాటర్ ఏరియాలోని 12 బాధిత గ్రామాలు, దిగువన ఉన్న గ్రామాలకు చెందిన రైతాంగం నిరసన దీక్షల్లో పాల్గొననుంది.

You cannot copy content of this page