మేడిగడ్డ బాధిత రైతుల డిమాండ్…
మహారాష్ట్రలో వినతి పత్రం
దిశ దశ, దండకారణ్యం:
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్దరణకు ముందు తమ సమస్యను పరిష్కరించాలని మహారాష్ట్ర రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఏ మాత్రం లాభం లేకున్న తమ పంటభూములను అప్పగించినప్పటికీ పరిహారం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు ఆరోపిస్తున్నారు. బ్యారేజీలో కుంగిపోయిన పిల్లర్లను బాగు చేసే ముందే ముంపునకు గురవుతున్న భూములపై సమగ్ర సర్వే చేసి అందరికీ పరిహారం అందించాలంటున్నారు. ఈ మేరకు సోమవారం సిరొంచ తహసీల్దార్ కు కూడా బాధిత రైతులు వినతి పత్రం సమర్పించి తమ గళాన్ని వినిపించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకాలోని 12 గ్రామాల్లోని భూములు మేడిగడ్డ బ్యారేజీ కారణంగా ముంపునకు గురయ్యాయని, అయితే నిర్మాణానికి ముందు సర్వే జరిపి తక్కువ భూములు ముంపునకు గురువుతున్నాయని లెక్కలు చూపిన తెలంగాణ ప్రభుత్వం తమ పబ్బం గడుపుకుందని మహా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం తరువాత సర్వేలో గుర్తించినదానికంటే ఎక్కువ భూమి ముంపునకు గురవుతోందని రైతులు వివరించారు. అయితే మొదటి విడుతలో గుర్తించిన భూములకు కూడా తెలంగాణ ప్రభుత్వం పరిహారం చెల్లించకపోవడంతో తాము నిరసన కార్యక్రమాలు చేపడితే సర్వేల పేరిట కాలయాపన చేసిందని ఆరోపించారు. చివరకు తాము నిరవధిక దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో మహారాష్ట్ర ప్రభుత్వం తమకు రావాల్సిన పరిహారం గురించి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదని వాపోయారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో పాటు అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించడంతో పాటు దీక్షలను కొనసాగించడంతో ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు న్యాయం చేసిందని బాధిత రైతులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి విడుత గుర్తించిన భూములకే పరిహారం ఇవ్వకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమను ఆదుకుందన్నారు. అయితే రెండో విడుత సర్వే జరిపి అదనంగా ముంపునకు గురవుతున్న భూముల విషయంలో మాత్రం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత రైతులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ విషయంలో పెట్టిన శ్రద్దలో తమకు పరిహారం అందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దీంతో ముంపునకు గురైన భూముల్లో పంటలు పండించుకునే పరిస్థితి లేక అప్పులు చేస్తూ కాలం వెల్లదీశామని వివరించారు. అయితే కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను నిర్మించి బ్యాక్ వాటర్ స్టోరేజీ ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందున తమ డిమాండ్ పూర్తి చేసిన తరువాతే న్యాయం చేయాలని సిరొంచ తాలుకా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అదనంగా ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించిన పరిహారం ఇవ్వడంతో పాటు ముంపునకు గురయిన గ్రామాల్లోని ఇండ్లకు కూడా పరిహారం చెల్లించాలని కూడా కోరుతున్నారు. తమకు జీవనాధారం అయిన భూములన్ని మేడిగడ్డ బ్యారేజీలో ముంపునకు గురైన తరువాత ఇతర ప్రాంతాలకు వలస వెల్లడం తప్ప ఇక్కడే ఉండి ఉపాధి పొందే అవకాశం లేదని వారంటున్నారు. దీంతో బ్యారేజీ పునరుద్దరణ చేసేముందే అదనంగా ముంపునకు గురవుతున్న భూములకు సంబంధించిన పరిహారం, ఆయా గ్రామాల్లోని ఇండ్లకు సంబంధించిన పరిహారం చెల్లించాలని బాధిత గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనట్టయితే తాము మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడుతామని వారు హెచ్చరించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణులు కూడా తమ గోడును గమనించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఒక వేళ పరిహారం చెల్లించకుండానే మేడిగడ్డ బ్యారేజీని పునరుద్దరించినట్టయితే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.