జనం నాడి పట్టడం అంటే ఇదే… కెకె సర్వే అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు…

 

దిశ దశ, ఏపీ బ్యూరో:

సర్వేల ద్వారా పబ్లిక్ పల్స్  పట్టి ఎవరు గెలుస్తారో తేల్చడంలో మరోసారి ఆ సంస్థ తన పట్టును నిరూపించుకుంది. ఏపీ రాజకీయాల్లో మరోసారి జగన్ ప్రభంజనం సృష్టిస్తారని వివిధ ఏజెన్సీలు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. కెకె సర్వే ఏజెన్సీ ఒక్కటి మాత్రమే ఏపీలో అధికార మార్పిడి జరిగి తీరుతుందని తేల్చి చెప్పింది. పబ్లిక్ పల్స్ దొరకబట్టడంలో తిరుగులేదని భావించిన సంస్థలు కూడా ఏపీ ప్రజల మనస్సులో ఏముందో అర్థం చేసుకోలేకపోయాయి. కానీ కెకె మాత్రం పక్కాగా సీట్లతో సహా చెప్పి మరీ సంచలనం సృష్టించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఓడి పోతారని, వైఎస్ జగన్ భారీ మెజార్టీ సాధిస్తారని చెప్పి సక్సెస్ అయిన కెకె సర్వే ఈ సారి కూడా అదే పంథాలో ముందుకు సాగి సఫలం అయింది క్షేత్ర స్థాయిలో తిరుగుతూ సగటు ఓటరు మదిలో ఏముందో తెలుసుకుని ఈ సారి కూడా కెకె సర్వే ఏజెన్సీ తేల్చి చెప్పింది. ఈ సంస్థ ఇచ్చి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఏన్డీఏ కూటమి ఏపీలో 161 సీట్లను దక్కించుకుంటుందని వెల్లడించింది. 144 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 133 చోట్ల గెలుస్తుందని, 21 చోట్ల పోటీ చేసి జనసేన అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందని, పది స్థానాల్లో బరిలో నిలిచిన బీజేపీ ఏడు స్థానాల్లో జెండా ఎగురవేస్తుందని కెకె సర్వే ఏజెన్సీ స్ఫష్టం చేసింది. వైసీపీ 14 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుందని కూడా ప్రకటించింది. జిల్లాల వారిగా కూడా ఈ ఏజెన్సీ ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో కూడా అంచనా వేసింది. విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, అనంతరపురం పూర్వ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని కెకె సర్వే ఏజెన్సీ వెల్లడించింది. వైఎస్సార్సీపీకి తూర్పు గోదావరి, విశాఖపట్నం, ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానం, నెల్లూరులో రెండు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మూడు స్థానాలు దక్కుతాయని పేర్కొంది. రాష్ట్రంలో టీడీపీ తరువాత జనసేన రెండో అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని, ఈ పార్టీ నిల్చున్న 21 స్థానాలను కూడా గెల్చుకుంటుందని కూడా తేల్చి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో దాదాపు ఇదే రీతిలో ఏపీ ప్రజలు తీర్పు చెప్పడం గమనార్హం. 134 స్థానాల్లో టీడీపీ లీడ్ లో ఉండగా, 20స్థానాల్లో జనసేన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇతర ఏజెన్సీల కన్నా భిన్నంగా ఏన్డీఏ కూటమి ఇక్కడ గెలిచి తీరుతుందని ప్రకటించినట్టుగానే ఫలితాలు కనిపిస్తుండడంతో కెకె సర్వే ఏజెన్సీ వేసిన అంచనాలు కరెక్ట్ అయ్యాయని అనిపిస్తోంది.

You cannot copy content of this page