అటు రాష్ట్రం ఇటు కేంద్రం…

గోదావరి జలాల వినియోగం…

దిశ దశ, భూపాలపల్లి:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ లభ్యమవుతున్న నీటిపై కన్నేశాయి. ఆ నీటితో తమ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుండి లిఫ్ట్ సిస్టం ఏర్పాటు చేయగా తాజాగా కేంద్రం కూడా అదే ప్రాంతం నుండి నీటిని మళ్లించాలన్న సంకల్పంతో ఉంది. దీంతో మరోసారి శతాబ్దం క్రితం నాటి ప్రతిపాదిత ప్రాజెక్టు ప్రాంతం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తర్జనభర్జనలు సాగుతున్నప్పటికీ ఎదో ఓక చోట మాత్రం నీటిని మళ్లించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం ఖాయమైపోయిందని స్పష్టమవుంతోంది.

గోదావరి నీటి కోసం…

రాష్ట్రంలోని ఎగువ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా సమృద్దిగా వచ్చి చేరుతున్న నీటిని వినియోగించుకోవాలని చూస్తున్నాయి. శతాబ్దాలుగా ప్రతిపాదనల దశలోనే కొట్టుమిట్టాడిన చివరకు అక్కడ ప్రాజెక్టులు నిర్మించేందుకు సర్కారు సాహసించకపోవడంతో వందలాది టీఎంసీల నీరు సాగరగర్భంలో కలిసిపోవడం తప్ప మరోటి లేదని నిర్దారించుకున్నారంత. కానీ అనూహ్యంగా స్వరాష్ట్ర కల సిద్దించడంతో తెలంగాణ సర్కారు కాళేశ్వరం జలాలను వినియోగించుకునేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా మొదట ఏటా 180 టీఎంసీల నీటిని ఎగువ ప్రాంతాలకు తరించేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టింది. ఆ తరువాత అదనపు టీఎంసీ పనులకు కూడా శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం అదనంగా మరో 90 టీఎంసీల నీటిని ఎగువ ప్రాంతానికి తరలించే పనిలో నిమగ్నం అయింది. తాజాగా మూసీ నది ప్రక్షాళన చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు కాళేశ్వరం జాలాలను వినియోగించాలని నిర్ణయించింది. 700 క్యూసెక్కుల నీటిని కొండపోచమ్మ సాగర్ నుండి జంట జలాశయాలకు తరలించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది. రానున్న కాలంలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేయాలన్న యోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో గోదావరి జలాలను దక్షిణ తెలంగాణాకు అందించడంతో పాటు భాగ్యనగరానికి కూడా నీటిని అందించాలని భావిస్తున్నారు.

కేంద్రం టార్గెట్ ఇది…

తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత కలిసిన తరువాత దిగువ గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా అన్నారం, సిరిపురం పంప్ హౌజ్ ద్వారా సుందిళ్లకు, గోలివాడ పంప్ హౌజ్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మాణాలు జరిపారు. అయితే తాజాగా కేంద్రం ప్రభుత్వం గోదావరి జలాలాను కావేరికి అను సంధానం చేయాలన్న యోచనలో నిమగ్నమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా సర్వేలు కూడా చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. చత్తీస్ గడ్ నుండి గోదావరి నదిలో కలిసిన తరువాత ఇచ్చంపల్లి వద్ద గోదావరి, కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. జాతీయ నీటి అభివృద్ది సంస్థ(NWDA) క్షేత్ర స్థాయిలో సర్వే చేయడం కూడా ఆరంభించింది. 1980వ శతాబ్దంలో ఇక్కడ ఫ్రెంచ్ ఇంజనీర్లు బహుళార్ద సాధక ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టగా బ్యారేజ్ నిర్మాణం అర్థంతరంగా నిలిచిపోయి. స్వాతంత్ర్యానంతరం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వాలు పలు మార్లు ప్రయత్నించినప్పటి ఆచరణ సాధ్యం కాలేదు. తొలి ప్రధాని నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో సర్వేలు జరపడంతో పాటు ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేకంగా మూడు రాష్ట్రాలలో కార్యాలయాలు కూడా తెరిచారు. కానీ బ్యారేజ్ ఎత్తు విషయం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి. పర్యవారణ సమస్యతో పాటు తాము తీవ్రంగా నష్టపోతామని ఆయా రాష్ట్రాలు ఇచ్చంపల్లి నిర్మాణాన్ని వ్యతిరేకించాయి. ఆ తరువాత ఈ బ్యారేజ్ ఎత్తును 118 మీటర్ల నుండి 105 మీటర్లకు తగ్గించాల్సి వచ్చింది. దీంతో ఇక్కడి నుండి నీటిని గ్రావిటీ ద్వారా మళ్లించే అవకాశం ఉండదని ఎత్తిపోతలే బెటర్ అని భావించారు. 1986 ప్రాంతంలో తుది నిర్ణయం జరిగినప్పటికీ ఈ ప్రాజెక్టు మాత్రం కార్యరూపం దాల్చలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం గోదావరి, కావేరి అను సంధాన ప్రక్రియను వేగవంతం చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతం మీదుగా దిగువకు తరలిపోతున్న గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావాలని యోచిస్తోంది.

గోదావరి, కావేరి అనుసంధానంపై రాష్ట్రాల వాదనలు ఏంటో మరో స్టోరీలో…

You cannot copy content of this page