బ్లాక్ గ్రానైట్ క్వారీల కథ కంచికేనా..?

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలో మైన్స్ అండ్ జియోలాజి విభాగం అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చిన గ్రానైట్ క్వారీల విషయంలో ఉన్నతాధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన గ్రానైట్ క్వారీలను బ్లాక్ చేశారు అప్పటి అధికారులు. బ్లాక్ లిస్టులో చేర్చిన ఈ క్వారీల్లో మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించకూడదు. కానీ మైన్స్ అండ్ జియోలాజీ అధికారుల నిర్లక్ష్యం వల్ల యథేచ్ఛగా తవ్వకాలు జరిపినట్టుగా స్పష్టం అవుతోంది. తాజాగా మైన్స్ అండ్ జియోలాజీ స్టేట్ డైరక్టర్ సురేంద్ర మోహన్ ఇచ్చిన ఆదేశాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో 261 లీజు దారులకు సంబంధించిన క్వారీల్లో అక్రమ మైనింగ్ జరగకుండా నిరోధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ను కూడా డైరక్టర్ ఈ లేఖ ద్వారా సూచించారు.

అధికారులు నిర్లక్ష్యమా..?

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న 261 గ్రానైట్ క్వారీలను మైన్స్ అండ్ జియోలాజీ విభాగం గతంలోనే బ్లాక్ లిస్టులో పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే బ్లాక్ లిస్టులో ఉన్న క్వారీల్లో అక్రమ మైనింగ్ ను నిరోధించేందుకు సంబంధిత శాఖ అధికారులు అంతగా దృష్టి పెట్టనట్టుగా స్పష్టం అవుతోంది. మైన్స్ అండ్ జియోలాజీ విభాగం అధికారులు బ్లాక్ చేసిన క్వారీలపై విజిలెన్స్ చేశారా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్న సాకు చూపిస్తూ ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించి ఉంటారన్న చర్చ కూడా ఆ విభాగంలో సాగుతోంది. వాస్తవంగా పర్మిషన్ తీసుకున్న మైన్స్ కూడా తవ్వకాలు ఎలా చేస్తున్నారు, బ్లాకుల సైజు తదితర అంశాలను పరిశీలన చేసిన తరువాతే వే బిల్లులు ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే మ్యాన్ పవర్ తక్కువగా ఉందన్న సాకు చూపించిన మైన్స్ విభాగం అధికారులు క్వారీల ప్రతినిధులు తీసుకొచ్చిన కొలతల ఆధారంగా వేబిల్లులు జారీ చేసినట్టు కూడా విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన కొంతమంది అక్రమార్కులు బ్లాక్ లిస్టులో చేరిన క్వారీల్లో కూడా తవ్వకాలు జరిపి ఇతర క్వారీల వే బిల్లుల ద్వారా అమ్మకాలు జరిపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మరి కొన్ని చోట్ల అయితే జీరో దందా కూడా చేసి ఉంటారన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.

విచారణ చేస్తే…

అయితే కారణాలు ఏవైనా తాజాగా మైన్స్ అండ్ జియోలాజీ స్టేట్ డైరక్టర్ ఇచ్చిన ఆదేశాలను బట్టి 261 క్వారీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల బ్లాక్ లిస్టులో ఉన్న క్వారీల్లో ఇల్లీగల్ మైనింగ్ ఎంత మేర జరిగింది అన్న వివరాలు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది. సదరు క్వారీకి ఎంత విస్తీర్ణంలో గ్రానైట్ తవ్వకాలు జరిపేందుకు అనుమతి ఇచ్చారన్న వివరాలతో పాటు అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పడు క్వారీ కొలతల వివరాలూ ఉండే అవకాశాలు ఉన్నాయి. లేనట్టయితే సైంటిఫిక్ గణాంకాల ఆధారంగా అయినా ఆయా క్వారీల నుండి దొంగ దారిన గ్రానైట్ ఎంత దారి మల్లించారన్న విషయం తేట తెల్లం కానుంది. లీజు దారులను బాధ్యులను చేస్తూ వారిపై మైనింగ్ యాక్టు అమలు చేసినట్టయితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇతర క్వారీల వే బిల్లుల ఆధారంగా వ్యాపారం చేసినట్టయితే వే బిల్లులు జారీ అయిన ఆయా క్వారీల సామర్థ్యం వాటిలో సేకరించిన గ్రానైట్, ఎంత విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారు..? ఆ విస్తీర్ణంలో సేకరించిన బ్లాకుల సైజు, డ్యామేజ్ అయిన గ్రానైట్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారించినట్టయితే అనుమతులు తీసుకున్న క్వారీల్లో గ్రానైట్ సేకరించామని చూపించి తప్పుడు వేబిల్లులు తీసుకున్న వ్యవహారం బట్టబయలు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సర్కారుకు కోట్లలో ఆదాయం…

మైనింగ్ మాఫియా చేసిన అక్రమ తవ్వకాల వ్యవహారంపై సమగ్రంగా విచారణ చేసి ఎంతమేర గ్రానైట్ అక్రమంగా తరలించారన్న విషయాలపై పూర్తి స్థాయిలో ఆరా తీసినట్టయితే ఖచ్చితంగా లెక్కలు తేలే అవకాశాలు ఉంటుంది. మరో వైపున బ్లాక్ చేసిన క్వారీల్లో తవ్వకాలు జరిపిన అక్రమార్కులు తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి బ్లాక్ చేసిన క్వారీల్లో విచారణ చేసే సమయంలో ఆయ ప్రాంతాల్లో పని చేసిన లేబర్, మిషనరీల వివరాలు, నిర్వహాకుల ఆర్థిక లావాదేవీలు, వే బిల్లులు, రవాణా కోసం వినియోగించిన వాహనాలు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేసినట్టయితే ఖచ్చితమైన లెక్కలు తేలే అవకాశం ఉంటుంది. బ్లాక్ లిస్టులో ఉన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి అదే క్వారీల పేరిట కూడా వే బిల్లులు జారీ చేసిన సందర్భాలు కూడా లేకపోలేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల బాధ్యులైన వారిపై మైనింగ్ యాక్టు ప్రకారం పెనాల్టీ కూడా వేసే విధంగా చట్టాలు ఉన్నాయి. జరిమానాను రికవరీ, అటాచ్ మెంట్ యాక్టుల ద్వారా వసూలు చేసినట్టయితే పెద్ద మొత్తంలో డబ్బు ప్రభుత్వ ఖజానాలో చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇల్లీగల్ మైనింగ్ మాఫియాపై ప్రభుత్వం చొరవ తీసుకుని క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి ఉక్కుపాదం మోపినట్టయితే ఇక ముందు ఇలాంటి తప్పిదాలు చేసేందుకు సాహసించే వారు కూడా ఉండరు.

బ్లాక్ చేసిన క్వారీల సంఖ్యలివే…

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బ్లాకు లిస్టులో పెట్టిన గ్రానైట్ క్వారీల సంఖ్యలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 9, హన్మకొండ 5, జగిత్యాల 2, జనగామ 14, జోగులాంబ గద్వాల 4, కామారెడ్డి 3, కరీంనగర్ 66, ఖమ్మం 12, మహబూబాబాద్ 9, మహబూబ్ నగర్ 1, మంచిర్యాల 4, మేడ్చల్ 6, నాగర్ కర్నూల్ 1, నల్గొండ 1, నారాయణరావుపేట 1, నిర్మల్ 7, నిజామాబాద్ 11, పెద్దపల్లి 1, రాజన్న సిరిసిల్ల 20, రంగారెడ్డి 27, సంగారెడ్డి 8. సూర్యపేట 1, వికారాబాద్ 33, వరంగల్ 10, యాదాద్రి 2 చొప్పున ఉన్నాయి. బ్లాక్ లిస్టులో ఉన్న జాబితాలో కరీంనగర్ జిల్లానే ఉండడం గమనార్హం.

You cannot copy content of this page