దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
నేరం చేసి తప్పించుకునేందుకు విదేశాలకు చెక్కెసి హాయిగా బ్రతుకుతామన్న ధీమాతో ఉన్న వారికి ఇది చేదు వార్తే. భారత చట్టాలు విదేశాల్లో పని చేయవని కలలు కనే వారికి ఇది షాకింగ్ న్యూస్. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వల పన్ని పట్టుకుని తీరుతాం అంటున్నారు పోలీసులు. సంచలనాత్మక కేసుల్లోనే కాదు సాధారణ కేసులోను కఠినంగా వ్యవహరించి తీరుతామంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు మర్డర్ కేసు నిందితుడిని ఇండియాకు రప్పించి మరీ అరెస్ట్ చేశారు. సంఘటన వివరాల్లోకి వెల్తే…
జిల్లాలోని చందుర్తి మండలం మల్యాలకు చెందిన కొండూరి మల్లేశ్ 15 ఏళ్లుగా దుబాయిలో ఉపాధి కోసం నివసిస్తున్నాడు. గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తిపై అనుమానంతో సెప్టెంబర్ 13న కత్తితో దాడి చేసి పరార్ అయ్యాడు. ఇక్కడి పోలీసులకు చిక్కకుండా వెంటనే దుబాయ్ వెళ్లిపోయాడు. అయితే నిందితుడు మల్లేశ్ ను ఇంటర్ పోల్ సహాయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఇండియాకు రప్పించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో చందుర్తి సీఐ కిరణ్, ఎస్సై అశోక్ లు పాల్గొన్నారు.