ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతుచిక్కని వ్యూహం
బీఆర్ఎస్ తీరుపై సర్వత్రా చర్చ
దిశ దశ, కరీంనగర్:
పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం అంతు చిక్కకుండా పోయింది. సూచనప్రాయంగా సుముఖత వ్యక్తం చేస్తూనే పబ్లిక్ గా మాత్రం న్యూటల్ గా ఉంటామని చేసిన వ్యాఖ్యలు గందరగోళాన్ని సృష్టించాయి. బీఆర్ఎస్ నాయకత్వం సంకేతాలు ఇవ్వడంతోనే బీసీ వాదం ఎత్తుకున్నామని, అంతర్గతంగా మాత్రం ప్రసన్న హరికృష్ణకే అండగా నిలుస్తామని బీఆర్ఎస్ వర్గాలు చెప్పుకొచ్చాయి. దీంతో ఐదారు రోజులుగా బీఆర్ఎస్ మద్దతు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకేనని స్పష్టం అయిపోయింది. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వచ్చిన ఎమ్మెల్సీ కవితను ప్రసన్న హరికృష్ణ సతీమణి కలిశారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రాంతాల స్థానిక నాయకులను బుధవారం ఉదయం 7.30 గంటల వరకే రావాలని మంగళవారం ఎమ్మెల్సీ కవిత నుండి పిలుపు వచ్చింది. అయితే ఆమె మాత్రం ఉదయం 6 గంటల సమయంలోనే వేములవాడకు చేరుకుని సమీకరణాల్లో నిమగ్నం అయినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇవ్వాలని కవిత నేరుగానే పిలుపునిచ్చారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో పాటు ఎమ్మెల్సీ కవిత, ప్రసన్న హరికృష్ణ భార్య ఇద్దరు కూడా థంబ్ చూపిస్తూ దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయిన ఈ సందర్భంగా ప్రసన్న హరికృష్ణ భార్య తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవితను అభ్యర్థించారని ఇందుకు ఆమె సుముఖ వ్యక్తం చేశారని కూడా పార్టీ వర్గాలు చెప్పాయి. ఇందుకు అనుగుణంగా కల్వకుంట్ల కవితకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లలో ప్రసన్న హరికృష్ణకు కవిత మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ అంశంపై మీడియాలో చర్చ జరిగినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కౌంటర్ ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్సీ కవిత ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇవ్వడం ఖాయమని భావించారంతా. అయితే గురువారం పోలింగ్ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలు మరో విధంగా ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు. ఇక్కడే మాట్లాడిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాత్రం తమ అభ్యర్థిని నిలబెట్టనందున తాను ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ఓటు వేయాలో వారికే వేసానని వ్యాఖ్యానించారు కానీ, పార్టీ వైఖరి ఎంటీ అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అయితే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వారిని కలిసేందుకు వచ్చినప్పుడు అప్యాయంగా పలకరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోలను బీజేపీ వైరల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వైఖరిని విమర్శించింది. మరోవైపున మాజీ కార్పోరేటర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సన్నిహితుళ్లలో ఒకరైన ఎడ్ల అశోక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవిందర్ సింగ్ కు అనుకూలంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. వేల కోట్లున్న వారికి, ఒక రూపాయితో పథకాలు అమలు చేసిన వారికి మధ్య జరుగుతున్న పోటీ అని నిరుపేదలకు భరోసా ఇచ్చే విధంగా స్కీమ్స్ అమలు చేసిన రవిందర్ సింగ్ ను గెలిపించాలని పిలపునిచ్చారు.
గందరగోళ ప్రకటనలు…
నిన్న మొన్నటి వరకు అధిష్టానం మాట జవదాటకుండా వ్యవహరించిన బీఆర్ఎస్ పార్టీలో వైవిద్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన బీఆర్ఎస్ పార్టీ అదే స్టాండ్ పై చివరి వరకూ కొనసాగినా బావుండేది కానీ చివరి నిమిషంలో సమీకరణాలు మార్చేందుకు దూకుడు ప్రదర్శించడం అటు పార్టీ వర్గాలను ఇటు ఓటర్లను తికమకపెట్టింది. అయితే అంతర్గతంగా మద్దతు ఇవ్వడం, ముఖ్య నాయకుల సన్నిహితుల ద్వారా సంకేతాలు పంపించడం, ప్రసన్న హరికృష్ణ భార్యను కలవడం వంటి చర్యలు పార్టీ విధానం ఏంటోనన్న చర్చ కూడా ఓ వర్గంలో సాగింది. బాజాప్తాగా తమ వైఖరి వెల్లడించడంలో అయినా, పార్టీ ఒకింత గందరగోళ పరిస్థితులను క్రియేట్ చేసినట్టయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.