పెళ్లి ఆగిపోయిందంటే దానికి పలు కారణాలు ఉంటాయి. వాటిలో వరకట్నం ఒకటి. వరకట్నం సరిపోలేదని అబ్బాయి పెళ్లి ఆపేసిన ఘటనలు చాలానే చూశాము. కానీ, ఓ పెళ్లి మాత్రం ఊహించని విధంగా ఆగిపోయింది. మరో గంటలో పెళ్లి జరగనుండగా.. తనకు ఎదురుకట్నం సరిపోలేదని ఓ వధువు పెళ్లిని నిరాకరించింది. తనకు పెళ్లి వద్దంటూ తెగేసి చెప్పింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. అమ్మాయికి ఎదురు కట్నం కింద రెండు లక్షల రూపాయలు ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం జరిగింది. దీంతో ఈ నెల 9న రాత్రి 7 గంటల 21 నిమిషాలకు పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరుగుతుందని అబ్బాయి కుటుంబ సభ్యులు ఆహ్వాన పత్రిక బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆ ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు.
అయితే ముహూర్తం సమయం దగ్గరపడుతున్నా వధువు రాకపోవడంతో వరుడి కుటుంబసభ్యులు ఏమైందని ఆరా తీశారు. అబ్బాయి వాళ్లు ఇచ్చే కట్నం సరిపోలేదని అదనపు కట్నం కావాలని వధువు డిమాండ్ చేసింది. తను అడిగినంత కట్నం ఇవ్వకపోతే పెళ్లి క్యాన్సిల్ చేస్తానని స్పష్టం చేసింది. ఏం చేయాలో పాలుపోక వరుడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
వధువు కుటుంబ సభ్యులను స్థానిక సీఐ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు వారిని మందలించి ఇరు కుటుంబ సభ్యులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా వారు దానికి ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి ఆగిపోయింది. బంధువులతో కళకళలాడాల్సిన కల్యాణ మండపం కాస్త వెలవెలబోయింది.